అదే ఫార్ములా : నాడు చంద్రబాబు - నేడు లోకేష్
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు స్థానం చాలా బలమైనది. పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. తొలి ఎన్నికల్లోనే అధికారం దక్కింది. కానీ సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసింది మాత్రం చంద్రబాబు అని అంతా ఒప్పుకుంటారు.
By: Satya P | 27 Feb 2026 11:00 AM ISTతెలుగుదేశం పార్టీలో చంద్రబాబు స్థానం చాలా బలమైనది. పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. తొలి ఎన్నికల్లోనే అధికారం దక్కింది. కానీ సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసింది మాత్రం చంద్రబాబు అని అంతా ఒప్పుకుంటారు. 1984 లో జరిగిన నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ లో చంద్రబాబు పోషించిన పాత్ర కూడా ఎంతో కీలకమైనదిగా అంతా అంటారు. ఆ తరువాత 1985లో వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకుండా కేవలం పార్టీ బాధ్యతలకే పరిమితం అయి సంస్థాగతంగా గట్టిగా ఉండేలా చూసారు. టీడీపీలో శిక్షణా తరగతులను నిర్వహించడమే కాదు ప్రతీ కార్యకర్త నుంచి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే దాకా అందరితోనూ నేరుగా మమేకం కావడం బాబుకు అలవాటు. దాని వల్లనే 1995లో టీడీపీలో నాయకత్వం మార్పిడి చాలా సులువుగా జరిగిపోయింది. ఎన్టీఆర్ టికెట్ ఇచ్చి గెలిపించినా పార్టీలో మాత్రం బంధం అంతా బాబుతోనే అన్నది ఎమ్మెల్యేలు భావించడం బట్టే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు. బాబు నాయకత్వాన్ని నూరు శాతం ఎమ్మెల్యేలు సమర్ధించడానికి పార్టీ మీద పట్టు ఎమ్మెల్యేలతో నేరుగా వ్యక్తిగత పరిచయాలు కారణంగా చెబుతారు.
ఆత్మీయ సమావేశాలతో :
ఇదిలా ఉంటే నారా లోకేష్ ప్రస్తుతం తండ్రి చంద్రబాబు బాటలో నడుస్తున్నారు. ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు ఆయన హజరవుతున్నారు. క్యాడర్ తో పరిచయాలను పెంచుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో కూడా కలసి నడిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక గ్యాప్ మాత్రం సీనియర్ నేతలు అలాగే సీనియర్ ఎమ్మెల్యేలతో ఉంది అన్న భావన ఏర్పడింది. దానిని పోగొట్టుకోవడానికే నారా లోకేష్ ఎమ్మెల్యేలు ఎంపీలు సీనియర్ నేతలు వారి కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.
భవిష్యత్తు కోసమే :
పార్టీలో చంద్రబాబుకు ఎన్టీఆర్ సీఎం గా ఉన్న రోజులలో సైతం అత్యధిక ఆమోదం ఉంది. బాబు వద్దకు చనువుగా స్వేచ్చగా ఎమ్మెల్యేలు వెళ్ళి తమ సమస్యలు చెప్పుకుని పనులు చేయించుకునేవారు. ఒక విధంగా బాబు వారికి మార్గదర్శకుడిగా ఉండేవారు. ఇపుడు తెలుగుదేశంలో చంద్రబాబుతోనే సీనియర్ నేతలు ఉంటున్నారు. అలాగే ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా బాబు వద్దకే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ తరహా ఆత్మీయ విందు సమావేశాలు పార్టీకే కాదు లోకేష్ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడతాయని అంటున్నారు.
కుటుంబాలతోనే :
కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు వారి కుటుంబాలతో కూడా లోకేష్ మమేకం కావడం వల్ల మంచి బంధం ఏర్పడుతుంది అని అంటున్నారు. రానున్న కాలంలో టీడీపీ ఇంకా విస్తరించడానికే కాదు లోకేష్ నాయకత్వం పట్ల అంతా సానుకూలంగా స్పందించడానికి కారణం అవుతుంది అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజున అధికారంలో ఉంది. ఇరవై నెలల పాలన జరిగిపోయింది. ఇంకా నలభై నెలలు ఉంది. నాయకత్వం మార్పిడి అన్నది అవసరం. అది ఈ రోజు జరుగుతుందా లేక రేపు జరుగుతుందా మరో ఏడాది తరువాత లేక 2029 ఎన్నికలు తరువాతనా అన్నది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వం అవసరం అనివార్యం అన్న సంగతి అందరికీ తెలుసు.
సరైన దిశలోనే :
అందుకే ఆ నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకునే లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. ఎపుడు టీడీపీలో నాయకత్వం మార్పు జరిగినా అది స్మూత్ గా సాఫీగా జరిగిపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎక్కువ మంది నాయకులు లోకేష్ నాయకత్వం పట్ల మక్కువ చూపిస్తున్నారు. నూటికి నూరు శాతం ఎలాంటి ఇబ్బంది లేకుండా లోకేష్ తో ఎలాంటి గ్యాప్ లేకుండా ముందుకు సాగేందుకు ఈ ముందస్తు కసరత్తు అంతా అని విశ్లేషిస్తున్నారు. మరి లోకేష్ నాయకత్వం ఎపుడు అంటే అది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని జవాబు వస్తోంది. సరైన సమయంలో అది జరిగి తీరుతుందని అంటున్నారు. ఏది ఏమైనా పార్టీతోనే నాయకుడు అన్నది నిరూపించడమే కాకుండా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న చంద్రబాబు లోకేష్ కి ఈ విషయంలో స్ఫూర్తి దాయకంగా ఉంటున్నారు అని చెప్పాల్సి ఉంది.
