శబరి.. పాలిటిక్స్ రివర్స్.. వాట్ హ్యాపెన్డ్ ..!
టీడీపీ కర్నూలు ఎంపీ బైరెడ్డి శబరి వ్యవహారం.. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 20 April 2025 3:00 AM ISTటీడీపీ కర్నూలు ఎంపీ బైరెడ్డి శబరి వ్యవహారం.. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో ఉన్న శబరి.. తర్వాత అనూహ్యంగా టికెట్ పొంది.. విజయం సాధించారు. అయితే.. నియోజకవర్గంలో కాకలు తీరిన టీడీపీ నాయకులకు ఆమె ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. శబరి దూకుడును వారు పట్టించుకోవడం లేదు. పైగా.. ఆమెనే పక్కన పెడుతున్నారన్న చర్చసాగుతోంది.
కర్నూలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చక్రం తిప్పాలని శబరి భావించారు. ఇది తప్పుకాదు. కానీ, అప్పటికే కొన్నేళ్లుగా టీడీపీ తరఫున కార్యక్రమాలు నిర్వహించి వారు. ప్రస్తుతం విజయం దక్కించుకున్న వారు.. తమ హవాకు అడ్డుపడితే ఊరుకుంటారా? ఇప్పుడు ఇదే జరుగుతోంది. పాణ్యంలో చిన్న వ్యవహారం.. ఎంపీని ఇబ్బంది పెట్టింది. ఒక చిన్న ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం స్వీపర్, వాచ్‌మెన్ విషయంలో ఎంపీ పతానికి పోయారు. తన వారినే నియమించాలని పట్టుబట్టారు.
కానీ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాత్రం ఎంపీ శబరి తాలూకు మనుషులను పక్కన పెట్టి తన వారిని నియమించుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున శబరి యాగీ చేసినా ఫలితం దక్కలేదు. ఇక, ఈ వ్యవహారం ఇలా ఉంటే.. తన సొంత నియోజకవర్గం నందికొట్కూరు నుంచి ఒకరిద్దరు అనుచరులకు నామినేటెడ్ పదవులు ఆశపెట్టారు శబరి. వారికి ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు కూడా లిస్టు పంపించారు. కానీ, ఆమె చెప్పిన వారికి పదవులు దక్కలేదు.
పైగా.. ఆమె నిరంతరం ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి వర్గానికి చంద్రబాబు వీరతాళ్లు వేశారు. దీంతో నిన్న మొన్నటి వరకు శబరి వెంటే తిరిగిన వర్గంలోని కౌన్సిలర్లు.. శివానందరెడ్డి గ్రూపులోకి చేరిపోయారు. ఇలా సొంత నియోజకవర్గంలోనే శబరి రాజకీయ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పైకి మాత్రం తను హవానే చెల్లుతోందని చెబుతున్నా.. అంతర్గతంగా ఆమె బీజేపీ నాయకులతో కలిసి తిరుగుతుండడంతో టీడీపీనాయకులు తమ పార్టీ ఎంపీనే అయినప్పటికీ.. దూరం పెడుతున్నారు.
