Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కాంలో ఎంపీ కేశినేని.. మాజీ ఎంపీ ఆరోపణ

బెజవాడ బ్రదర్స్ కేశినేని చిన్ని, ఆయన అన్న కేశినేని నాని మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 May 2025 11:30 AM IST
లిక్కర్ స్కాంలో ఎంపీ కేశినేని.. మాజీ ఎంపీ ఆరోపణ
X

రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. తన ‘ఎక్స్’ అకౌంటులో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ లిక్కర్ స్కాంలో ఆయన పాత్రపై విచారణ జరపాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. ప్రస్తుతం లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు అరెస్టు అవుతున్నారు. ఈ సమయంలో టీడీపీ ఎంపీకి సంబంధం ఉందంటూ వైసీపీ నేత, మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.

బెజవాడ బ్రదర్స్ కేశినేని చిన్ని, ఆయన అన్న కేశినేని నాని మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 60 ఎకరాలు తీసుకున్నా ఉర్సా కంపెనీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ అంటూ గతంలో మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. గత పది పదిహేను రోజులుగా ఈ విషయం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపగా, తాజాగా లిక్కర్ స్కాంలోనూ ఆయనకు పాత్ర ఉందని మాజీ ఎంపీ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి, ఆయన సన్నిహితుడు, మరో నిందితుడు పైలా దిలీప్ తో ఎంపీ కేశినేని చిన్నికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని మాజీ ఎంపీ కేశినేని నాని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్, ఆయన భార్య జానకి లక్కి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLPలో భాగస్వాములుగా ఉన్నారని మాజీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఈ కంపెనీ ప్లాట్ నంబర్ 9, సర్వే నంబర్ 403, జూబ్లీ హిల్స్, హైదరాబాదులో ఉందని, ఈ చిరునామాతో ఎషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా కొనసాగుతోందని చెప్పారు. ఎషాన్ని ఇన్ఫా ప్రా కంపెనీ కేసిరెడ్డి, ఆయన అనుచరుడు పైలా దిలీప్ కు చెందినది మాజీ ఎంపీ తెలిపారు.

అంతేకాకుండా ప్రధాన నిందితుడు కేసిరెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ కంపెనీలతోపాటు పలు వ్యాపారాల్లో ఇద్దరూ భాగస్వాములు అంటూ ఆయా కంపెనీల పేర్లను మాజీ ఎంపీ వెల్లడించారు. ఇక నిందితుడు కేసిరెడ్డితో కలిసి ఎంపీ కేశినేని చిన్ని లిక్కర్ స్కాంలో దోచుకున్న సొమ్మును విదేశాలకు తరలించారని మాజీ ఎంపీ నాని ఆరోపించారు.

ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన మాజీ ఎంపీ కేశినేని నాని మాత్రం తన తమ్ముడు ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్ గా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఉర్సా, ఇప్పుడు లిక్కర్ స్కాంలో ఆయన ప్రమేయంపై విమర్శలు చేశారు. మధ్యలో విజయవాడలో ఎంపీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని ఆక్షేపించారు. మాజీ ఎంపీ ఆరోపణలపై ఎంపీ కేశినేని స్పందించాల్సివుంది.