ఏపీలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రె`ఢీ`.. !
ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలకు పైగా సమయం ఉంది. పైగా వారంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే.
By: Garuda Media | 28 April 2026 7:00 PM ISTఎన్నికలకు రెండున్నర సంవత్సరాలకు పైగా సమయం ఉంది. పైగా వారంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే. అయినప్పటికీ వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే కొందరు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో తమ సొంత ప్రాంతాలను కాదని వేరే ప్రాంతాలకు వెళ్లి వేరే నియోజకవర్గాలకు వెళ్లి పోటీ చేశారు. దీంతో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో.. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తే తమ పరిస్థితి ఏమిటి అన్నది కొంతమంది ఎమ్మెల్యేలకు దిగులు పట్టుకుంది. ఇది వాస్తవం కూడా. గత ఎన్నికల్లో అంటే కూటమి ప్రభావం ఉంది.
వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. కాబట్టి ఎవరు పోటీ చేశారు.. ఎవరు నిలబడ్డారు.. అన్నది కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు గమనించలేదు. కేవలం పార్టీ గుర్తులు, పార్టీ అధినేతలను చూసి వారు ఓటేశారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి రిపీట్ అవుతుందా అంటే కష్టం. ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలన కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. ఎంతో కొంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం పైన అయినా ఉంటుంది. దీనికి చంద్రబాబు మాత్రం అతీతులు కారు.
గత 2019 ఎన్నికల్లో ఓడిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు తమ తమ సొంత నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒకవైపు పనులు చేస్తూనే.. ఎందుకైనా మంచిది అని తమ సొంత నియోజకవర్గాలపై ఒక అడుగు వేశారు. ఇటువంటి వారిలో మాజీ మంత్రులు ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వీరంతా తరచుగా తమ తమ సొంత నియోజకవర్గంలో పర్యటించడంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా తమ అనుచరుల ద్వారా తెలుసుకుంటున్నారు.
అంతేకాదు స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను వీరు నిరంతరం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో తమ సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తే తమ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఇప్పటినుంచి లెక్కలు కట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ జాబితాలో మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే కళా వెంకట్రావుతో పాటు సీనియర్ నాయకులు, జూనియర్ ఎమ్మెల్యేలు ఇలా అనేకమంది ఉన్నారు. వీరందరి లక్ష్యం.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటం. అయితే తమది కానీ నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేస్తే వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇది తమకు మైనస్ గా మారుతుందని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తమ తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లి పోటీ చేసి మరోసారి గెలుపు గుర్రం ఎక్కి దిశగా ఆలోచన చేస్తున్నారు. అప్పుడు ఎంత వ్యతిరేక ప్రభావం ఉన్నప్పటికీ.. సొంత నియోజకవర్గంలో సొంత అనుచరులు సొంత సామాజిక వర్గం తమకు సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని నాయకులు అంచనా వేస్తున్నారు. మరి దీనికి ఎటువంటి పరిస్థితులు వస్తాయి.. పార్టీ అధినేత చంద్రబాబు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.
