ఎమ్మెల్యేల పనితీరు: టీడీపీ నేతలు మారారా.. ?
ఈ ఏడాదిలో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా టిడిపి మెజారిటీ పార్టీగా ఉన్న కూటమి ప్రభుత్వంలో ఈ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రజలకు చేరువ అయ్యారు? అనేది కీలక అంశం.
By: Garuda Media | 30 Dec 2025 7:00 AM ISTఈ ఏడాదిలో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా టిడిపి మెజారిటీ పార్టీగా ఉన్న కూటమి ప్రభుత్వంలో ఈ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రజలకు చేరువ అయ్యారు? అనేది కీలక అంశం. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తరచుగా సమీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు మార్కులు వేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయ్యాయి. పైగా సూపర్ సిక్స్ పథకాలను 99 శాతం అమలు చేశామని ప్రభుత్వం స్వయంగా చెబుతోంది.
ఇటు ప్రభుత్వానికి అటు ఎమ్మెల్యేలకు కూడా ఇమేజ్ పెంచుకునే అవకాశం, పెరిగే అవకాశం రెండు ఉన్నాయి. ఇదే సీఎం చంద్రబాబు పదే పదే చెప్పారు. చెబుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన తరచుగా సమీక్షలు చేశారు. నివేదికలు తెప్పించుకున్నారు. అదేవిధంగా పార్టీపరంగా కూడా చర్చించారు. అయినప్పటికీ రాష్ట్రంలో 134 మంది ఎమ్మెల్యేలు ఉంటే వీరిలో ఇప్పటికీ 72 మంది ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారు. నియోజకవర్గాల్లో ఒక్కసారి కూడా పర్యటించని ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది.
నియోజకవర్గంలో పర్యటించడం అనేది ఎమ్మెల్యే హక్కు. అదేవిధంగా బాధ్యత కూడా. ముఖ్యంగా ప్రజలు కోరుకునేది తమ ఎమ్మెల్యే తమకు కనిపిస్తే చాలని కోరుకుంటారు. ఎందుకంటే తమ సమస్యలు కనీసం చెప్పుకోవడానికైనా అవకాశం ఉంటుందనేది వారి భావన. కానీ, 12 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు పర్యటించలేదు. పైగా వారంతా హైదరాబాద్, బెంగుళూరు, విదేశాల్లో మకాం వేశారు అనేది సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చిన విషయం. ఇదిలా ఉంటే మిగిలిన వారిలో 52 మంది ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువయ్యారు.
నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారు. మడకశిర వంటి నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరింత ఎక్కువగా ప్రజలతో కలిసి పోతున్నారు. దీనివల్ల ఇటు ప్రభుత్వానికే కాదు అటు ఎమ్మెల్యేకి కూడా ప్రజల్లో గ్రాఫ్ పెరుగుతుంది. ప్రజల దృష్టిలో మంచి నేతలుగా గుర్తింపు పొందుతారు. పైగా వచ్చే ఎన్నికలనాటికి విజయం సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది. కానీ, ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికీ లైట్ గా తీసుకుంటున్నారు.
మరికొందరు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసిన తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు మారకపోతే కష్టం అన్నది చంద్రబాబు స్వయంగా చెబుతున్న మాట. ఇప్పటికే 18 నెలలు గడిచిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మారాలని ఆయన చెబుతున్నారు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధిని చూస్తే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని అమలవుతున్నాయి. కొన్ని ఇంకా నిదానంగానే నడుస్తున్నాయి. ప్రజలకు సంక్షేమం మాత్రం ఆపకుండా ప్రభుత్వం ఇస్తుండటం ఒకటే ఎమ్మెల్యేలకు కలిసి వస్తున్న ప్రధాన అంశం.
