Begin typing your search above and press return to search.

మా ఎమ్మెల్యేతో తలనొప్పి..!! సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత?

ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారారని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   13 Oct 2025 9:39 AM IST
మా ఎమ్మెల్యేతో తలనొప్పి..!! సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత?
X

ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు. ఈ జిల్లాలో చంద్రబాబు సహచరుడు, ఆయన ప్రాణ స్నేహితుడు దివంగత నేత బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి. ఈయన కుమారుడు, ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనితీరుపై పెదవి విరుస్తున్నారు. ఆయనతో వేగలేకపోతున్నామని అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు పంపుతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సైతం సుధీర్ రెడ్డి వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయినా ఎమ్మెల్యే మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదని టాక్ నడుస్తోంది.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆయన కన్నా, గత ఎమ్మెల్యే వైసీపీ నేత బియ్యపు మధుసూదనరెడ్డి వెయ్యి రెట్లు బెటర్ అంటూ టీడీపీ కార్యకర్తలు తమ పార్టీ హైకమాండ్ కు లేఖలు రాస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు 100 పేజీల లేఖ ద్వారా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను పార్టీ హైకమాండ్ కు తెలియజేసినట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నియోజకవర్గంలోని ఓ పోలీసు అధికారి బదిలీపై సుధీర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఇక తాజాగా ఓ స్క్రాప్ డీలర్ ను వేధిస్తున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన సుధీర్ రెడ్డిపై తొలి నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జనసేన మాజీ ఇన్చార్జి కోట వినుత డ్రైవరు రాయుడును కోవర్టుగా వాడి ఆమె రహస్య విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారని సుధీర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వినిపించాయి. రాయుడు హత్యకు సుధీర్ రెడ్డి పరోక్షంగా కారణమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా తన వ్యవహార సరళిని సమర్థించుకున్న సుధీర్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సంచలన చర్చకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఆ తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు.

తన స్నేహితుడు, దివంగత నేత బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డిని ద్రుష్టిలో పెట్టుకుని సుధీర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ ఎప్పటికప్పుడు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నా సరే ఆయనే పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహనాన్ని పరీక్షించేలా సుధీర్ రెడ్డి వ్యవహరిస్తే ఆయనపై కచ్చితంగా చర్చలు తీసుకునే అవకాశం ఉందని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. అనతికాలంలోనే ముఖ్యమంత్రి హిట్ లిస్టులోకి సుధీర్ రెడ్డి చేరిపోయారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన తీరు మారుతుందా? లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.