చంద్రబాబు హిట్ లిస్టులో చేరిన ఎమ్మెల్యేలు ఎందరు..? ప్రత్యామ్నాయం రెడీనా!
కూటమికి మొత్తం 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, ఇందులో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 135. వీరిలో కొత్తగా గెలిచిన వారు దాదాపు 68 మంది ఉన్నారు.
By: Tupaki Desk | 1 July 2025 7:00 PM ISTఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి చేసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కూటమి పార్టీలు తమ అధికారం ఇలానే కొనసాగాలని, పొత్తులో ఎక్కడా పొరపాటు లేకుండా చూడాలని కోరుకుంటున్నాయి. అయితే కొందరు ఎమ్మెల్యేల తీరువల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఆదివారం టీడీపీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించినట్లు వెల్లడించారు చంద్రబాబు. అంతేకాకుండా వన్ టు వన్ మాట్లాడతానని, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు మారితే సరేసరి లేదంటే అంతే సంగతులు అంటూ హెచ్చరించారు సీఎం.
అయితే ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? ఎవరెవరిపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనేది క్లారిటీ ఇవ్వలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, పనితీరు సరిగా లేని వారితోనే తాను నేరుగా మాట్లాడినప్పుడు ఆ విషయాలను చర్చిద్దామని సీఎం చెప్పడంతో ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రహస్యంగా సేకరించిన సమాచారంలో తమపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయో తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందితోపాటు సీనియర్ మంత్రులు, యవనేత లోకేశ్ కార్యాలయంతో చాలా మంది సంప్రదింపులు చేస్తున్నారు.
కూటమికి మొత్తం 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, ఇందులో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 135. వీరిలో కొత్తగా గెలిచిన వారు దాదాపు 68 మంది ఉన్నారు. మిగిలిన వారు రెండు అంతకన్నా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఎక్కువ మందిపై ఆరోపణలు వస్తున్నాయని అంటున్నారు. కార్యకర్తలను సమన్వయం చేయలేకపోవడం, వారి పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్న నేతలను అదుపు చేయకపోవడం వల్ల ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అంటున్నారు.
ప్రధానంగా ఇసుక, గనులు, లిక్కర్ వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు తలదూర్చుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదేసమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతిపక్షం వైసీపీతో సిండికేట్ అయినట్లు కొందరిపై ఆరోపణలు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో జిల్లాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రికి నివేదికలు వెళ్లాయని అంటున్నారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు తెలుగుదేశం పార్టీ సొంత సర్వే టీములు ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తయారు చేసినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలకు కూడా ఎమ్మెల్యేలపై ఆరా తీసే బాధ్యతలను అప్పగించారని అంటున్నారు.
మరోవైపు ఐవీఆర్ఎస్ ద్వారా కూడా తెప్పించుకున్న సమాచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలపై ఓ అంచనాకు వచ్చారంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున ఎమ్మెల్యేలు అందరికి చెప్పి చూడాలని, వారిని సరైన మార్గంలో నడిపించే యంత్రాంగాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం భావిస్తున్నారు. అదేసమయంలో ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యామ్నాయం కూడా ఇప్పుడే రెడీ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎవరు సమర్థులో గుర్తించాలని పార్టీ ప్రతినిధులకు సూచించినట్లు చెబుతున్నారు.
