Begin typing your search above and press return to search.

ఎస్సై పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. పోలీసులు సీరియస్?

అవును... తిరువూరు ఎస్సై సత్యనారాయణ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని గంజాయి అమ్మే, కొనే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు.

By:  Tupaki Desk   |   23 July 2025 2:13 PM IST
ఎస్సై పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. పోలీసులు సీరియస్?
X

ఆంధ్రప్రదేశ్ లో గంజాయి విచ్చలవిడిగా హల్ చల్ చేస్తోందని.. ఎక్కడబడితే అక్కడ లభ్యమవుతోందని.. ప్రధానంగా కాలేజీల్లో ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతుందనే ఆరోపణలు రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ సమయంలో కంచే చేను మేస్తోందంటూ.. ఓ ఎస్సైపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.

అవును... తిరువూరు ఎస్సై సత్యనారాయణ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని గంజాయి అమ్మే, కొనే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా... తిరువూరు స్టేషన్‌ లో ఎస్సై ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నాడని, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే తెలిపారు!

ఈ నేపథ్యంలోనే... తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని.. ఇది సరైన విధానం కాదని ఎమ్మెల్యే కొలికపూడి తెలిపారు. ఎస్సై సత్యనారాయణ ఓ గ్యాంగ్ ని పెట్టి గంజాయి అమ్మిస్తున్నాడని.. గత ప్రభుత్వ హయాంలో ఈ పని చేసి దొరికిపోయి, ఇప్పుడు వేరే పనులు చేసుకుంటున్నవారిని పిలిపించి, గంజాయి అమ్మి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడని అన్నారు.

దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి ఆరోపణలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యేలు, అదే ప్రభుత్వంలోని అధికారులపై ఆరోపణలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు! అధికారులు, నాయకులు ఒకేమాటపై ఉండి, కలిసి సుపరిపాలన అందించాలని సూచిస్తున్నారు!

మరోవైపు... ఎస్సైపై సాక్ష్యాత్తు అధికారపార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. పోలీసులు ఉన్నతాధికారులు స్పందిస్తున్నారని అంటున్నారు! ఈ విషయంలో వాస్తవాస్తవాలపై దర్యాప్తుకు ఆదేశించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అలాకానిపక్షంలో సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సమాజంలో అందోళనలు కలిగిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

నిజంగా ఇటువంటిది ఏమైనా జరిగితే... అధికార పార్టీ ఎమ్మెల్యే, సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి, సదరు ఎస్సైపై చర్యలకు ఉపక్రమించాల్సిందని.. అలా కాకుండా, ఇలా పబ్లిక్ గా ఆరోపణలు చేయడం సరైంది కాదనే మాటలూ వినిపిస్తున్నాయి!