లోకేశ్ అడుగు జాడల్లో టీడీపీ లీడర్స్ లోకల్ బుక్స్?
కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన గుమ్మనూరి జయరాం గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు.
By: Tupaki Desk | 27 Jun 2025 9:27 AM ISTటీడీపీ యువనేత, ఐటీ మంత్రి లోకేష్‌ను టీడీపీ లీడర్లు ఆదర్శంగా తీసుకున్నారా? లోకేష్ రెడ్ బుక్ తో విపక్షానికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంటే.. ఆయన దారిలో పయనిస్తున్నామని చెబుతున్న కొందరు టీడీపీ లీడర్లు లోకల్ గా తమ బుక్ లో వైసీపీ నేతలు, కార్యకర్తల పేర్లు రాసుకుంటున్నామని హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోగా తమ దారికి వస్తే సరి సరి.. లేదంటే తమ ప్రతాపం చూపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఈ తరహా హెచ్చరికలతో విపక్షాన్ని బెంబేలెత్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన గుమ్మనూరి జయరాం గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. అయితే అప్పటికే టీడీపీ నేతలకు ఆలూరు టికెట్ కన్ఫార్మ్ చేయడం, గ్రూపు తగాదాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో జయరాంకు పక్కనే ఉన్న అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన జయరాం.. ఆ తర్వాత సొంత పార్టీ కార్యకర్తలపైనా కాస్త కటువుగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఖబర్దార్ అంటూ మీడియాను బెదిరించడం కూడా వివాదాస్పదమైంది. ఈ పరిస్థితుల్లో ఆయనను టీడీపీ అధిష్ఠానం మందలించిందని కూడా చెబుతున్నారు.
అయితే గుంతకల్లులో టీడీపీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉన్న గుమ్మనూరు ఇటీవల ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారని చెబుతున్నారు. అయితే ఆయనతో సొంత పార్టీ వారే చికాకు పడుతుండటంతో వైసీపీ నుంచి నేతలు, కార్యకర్తలు వచ్చేందుకు వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు. దీంతో తాను పిలిస్తే పార్టీలోకి రానంటున్నవారి సంగతి తేలుస్తానని, అందరి పేర్లు తన రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని అంటున్నారట జయరాం. స్థానిక ఎన్నికల్లోపు వైసీపీ వారంతా టీడీపీకి జేజేలు కొడితే సరి, లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు గుమ్మనూరు.
టీడీపీ సంస్థాగత ఎన్నికలపై పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గుమ్మనూరి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని సర్పంచ్, ఎంపీటీసీ పదవులను టీడీపీ గెలుచుకోవాల్సిందేనని, ఇందుకు ఎదురుతిరిగిన వారి పేర్లు తన రెడ్ బుక్ లో రాసుకుంటానని, వారి సంగతి తేలే వరకు ఆ పుస్తకాన్ని తెరిచే ఉంచుతానని గుమ్మనూరు వ్యాఖ్యనిస్తుండటం హీట్ పుట్టిస్తోంది. మంత్రి లోకేశ్ తన రెడ్ బుక్ లో గతంలో దురుసుగా వ్యవహరించిన వారి పేర్లు రాసుకుంటే.. ఇప్పుడు అధికారంలో ఉండగా గుమ్మనూరు బెదిరింపులకు దిగడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
