Begin typing your search above and press return to search.

చంద్రబాబు చెప్పినా వినడం లేదా.. టీడీపీ ఎమ్మెల్యేలపై పెద్ద చర్చ?

టీడీపీలో క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యమిస్తారు. పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అధినేత నుంచి కింద స్థాయి వరకు అంతా పాటించాల్సిందే.

By:  Tupaki Desk   |   21 July 2025 8:00 PM IST
చంద్రబాబు చెప్పినా వినడం లేదా.. టీడీపీ ఎమ్మెల్యేలపై పెద్ద చర్చ?
X

టీడీపీలో క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యమిస్తారు. పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అధినేత నుంచి కింద స్థాయి వరకు అంతా పాటించాల్సిందే. ఇందులో ఎవరికీ ఎటువంటి సడలింపులు ఉండవు. 45 ఏళ్లుగా టీడీపీలో అధిష్టానం నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయడమే తప్పా.. ఎదురు తిరగడం, తప్పించుకుని తిరగడం అనే అంశాలకు అస్సలు చాయిస్ ఉండదు. ఒకటి, అరా ఉల్లంఘనలు ఉంటే, ఆ విషయమై అధిష్టానానికి సమాచారం ఉంటుందని చెబుతారు. అయితే ప్రస్తుతం పార్టీలో ఈ పరిస్థితి కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం సాదాసీదాగా మారిపోయిందని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరైతే అదో మొక్కుబడి తంతుగా మార్చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు చెప్పినా ఎమ్మెల్యేలు వినకపోవడం ఏంటని పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఈ నెల 2వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత నెల 29న అమరావతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగిలిన కేడర్ అంతా ఈ నెల రోజులు నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి వెళ్లి ఏడాదిగా ప్రభుత్వం చేసిన మంచిని, సంక్షేమాన్ని వివరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో రెండు రోజులు పర్యటించగా, యువనేత నారా లోకేశ్ వీలు చిక్కినప్పుడల్లా తన నియోజకవర్గం మంగళగిరిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఇక కార్యక్రమం మొదలై 20 రోజులు అయినందున ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించారని, రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సర్వేలో అధిష్టానానికి మతిపోయే సమాచారం వచ్చిందని అంటున్నారు. ప్రతిరోజూ కార్యక్రమం నిర్వహణపై పార్టీ సెంట్రల్ ఆఫీసు నుంచి పర్యవేక్షిస్తున్నా, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికతో అధిష్టానం విస్తుపోయిందని చెబుతున్నారు. దీంతో పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యేలు తప్పుడు నివేదికలు ఇస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చేయించిన సర్వేలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచి కొందరు సీనియర్ల వరకు దాదాపు 35 మంది ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ను పెద్దగా పట్టించుకోవడం లేదని తేలిందని అంటున్నారు.

కొందరు ఒకటి రెండు సార్లు మాత్రమే కార్యక్రమం నిర్వహించారని, మరికొందరు అదో మొక్కుబడి తంతుగా భావిస్తూ యాంత్రికంగా వచ్చి వెళుతున్నారని పార్టీకి నివేదిక అందిందని అంటున్నారు. అదేవిధంగా కొందరు సీనియర్లు ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉంటూ పార్టీ కార్యక్రమానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అంటున్నారు. ఇలా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేల్లో 15 మంది.. ఒకటికి మించి గెలిచిన వారు మరో 20 మంది వరకు ‘తొలి అడుగు’ను అడపాదడపా మాత్రమే నిర్వహిస్తున్నారని అధిష్టానానికి నివేదిక అందినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఎమ్మెల్యేలు ఎవరు? ఏయే నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమం సరిగా జరగడం లేదన్న వివరాలను పార్టీ బయట పెట్టడం లేదు. ఈ వివరాలు బయటకు వస్తే మిగిలిన వారు కూడా బద్దకించే ప్రమాదం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు 35 మంది ఎమ్మెల్యేల వివరాలు, వారు నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారన్న వివరాలతో కూడిన సమగ్ర నివేదిక సీఎం టేబుల్ పై ఉందని, వచ్చేనెలలో వారందరికీ క్లాసులు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏదిఏమైనా పార్టీలో తొలిసారిగా సీఎం చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.