Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే బ్రహ్మనందరెడ్డి కారుపై బీర్ బాటిళ్లతో దాడి

పల్నాడును తీవ్రంగా ప్రభావితం చేసే ఉదంతం ఒకటి మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంటుంది.

By:  Garuda Media   |   29 April 2026 10:32 AM IST
ఎమ్మెల్యే బ్రహ్మనందరెడ్డి కారుపై బీర్ బాటిళ్లతో దాడి
X

పల్నాడును తీవ్రంగా ప్రభావితం చేసే ఉదంతం ఒకటి మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తరహా రాజకీయం తెలంగాణలో అస్సలు కనిపించదు. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ శత్రుత్వానికి సంబంధించి కొన్ని జిల్లాల్లో ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తాయి. అత్యంత సున్నితంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఏ చిన్న ప్రతికూల పరిణామం జరిగినా పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారుతుంటాయి.

ఇందుకు తగ్గట్లే.. మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన వైనం సంచలనంగా అంతకు మించి షాకింగ్ గా మారింది. ఈ ఉదంతంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలాయి.. కారు పాక్షికంగా దెబ్బ తిన్నట్లు చెబుతున్నారు. వెంట ఉన్న గన్ మెన్లు వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచి.. ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడి ఉదంతం మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెంచేలా చేశాయి.

ఈ ఉదంతంపై టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి స్పందించారు. పథకం ప్రకారమే తన వాహన శ్రేణిపై దాడి జరిగినట్లుగా ఆరోపించారు. చీకట్లో తన కార్లపై దాడులు చేతకాని వారు చేయించే పనిగా అభివర్ణించిన ఆయన.. ఈ దాడి వెనుక ఉన్నది పిన్నెల్లి సోదరులుగా ఆరోపించారు. ‘దాడులు.. హత్యలు చేయించటం పిన్నెల్లి సోదరులకు మామూలే. వారి నీచ రాజకీయాల్ని ప్రజలు తిప్పి కొట్టినా బుద్ధి రాలేదు. వారి మాటలు నమ్మి ఆ పార్టీ కార్యకర్తలు తమ జీవితాలను పణంగా పెట్టొద్దు. ఎమ్మెల్యేపై ఆకతాయిలు ఎవరూ దాడులు చేయలేరు. ముమ్మూటికీ పిన్నెల్లి సోదరుల పథకం ప్రకారమే దాడి జిరిగింది. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో పిన్నెల్లి లాంటి గుంటనక్కలను ఎంతోమందిని చూశా. మాచర్ల టీడీపీ బాధ్యుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడే అన్నింటికీ తెగించి వచ్చా’’ అంటూ వ్యాఖ్యానించారు.

జరిగిన ఉదంతంలోకి వెళితే.. పల్నాడు జిల్లాలోని పాసర్లపాడు గ్రామంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి హాజరైన మాచర్ల ఎమ్మెల్యే తిరిగి వస్తున్న వేళలో.. మంగళవారం రాత్రి 10 గంటల వేళలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై బీరు బాటిళ్లతో దాడి జరిగింది. ఆ సమయంలో ఆయన కార్ల శ్రేణి నెమ్మదిగా కదులుతున్నాయి. జనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే కారు సైతం నెమ్మదిగా ముందుకు వెళుతున్నప్పుడే.. దాడికి పాల్పడినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

ఇది ముమ్మూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఆయన సోదరుడి హస్తం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి జాతరకు హాజరైన గ్రామం వైసీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉండే ప్రాంతంగా చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేపై దాడి జరగటానికి ఇదో కారణంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇందుకు పోలీసులు.. నిఘా విభాగాల వైఫల్యం తాజా పరిణామాల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

పిన్నెల్లి సోదరులకు బలం ఎక్కువగా ఉండే గ్రామానికి ఆయన వర్గీయులకు భిన్నంగా ప్రత్యర్థులు పర్యటించే ప్రోగ్రాం పెట్టుకుంటే.. అందుకు ప్రతిగా దాడులతో సమాధానంగా ఇచ్చే ప్రయత్నం జరగటానికి అవకాశం ఉంది. పల్నాడు రాజకీయాల గురించి.. ముఖ్యంగా పిన్నెల్లి సోదరుల గురించి తెలిసిన వారు ఎవరైనా అంచనా వేస్తారు. అలాంటిది పోలీసులు ఎందుకు వేయలేదు? అన్నది ప్రశ్న. దాడి జరిగిన తర్వాత మాత్రం వెంటనే స్పందింటం.. నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

బీర్ బాటిళ్లతో దాడి చేసిన సమయంలో ఆయన వెంట ఉన్న గన్ మెన్లు మాత్రం సందర్భానికి తగ్గట్లు స్పందించి.. ఎమ్మెల్యేను సురక్షితంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా పగిలిపోయినప్పటికీ.. గన్ మెన్ల అప్రమత్తతతో బ్రహ్మానందరెడ్డికి ఎలాంటి గాయాలు తగల్లేదని చెబుతున్నారు. దాడి జరిగినంతనే ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. పోలీసులు అదనపు బలగాలతో మొహరించి.. ఎమ్మెల్యే వాహనానికి కాన్వాయ్ ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపేశారు.

దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో వీడియో ఆధారాల్ని సేకరిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. గమనించాల్సిన అంశం ఏమంటే.. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఇదే బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టటానికి పెద్ద ఎత్తున సవాళ్లు ఎదురయ్యేవి. అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరగటం చూస్తే.. కూటమి ప్రభుత్వంలో పోలీసుల పని తీరుపై పలు ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తోంది. దాడికి పాల్పడిన వారు పది నుంచి పదిహేను మంది వరకు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఇందులో ఐదుగురు నుంచి ఏడుగురు వరకు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.