మినీ మహానాడుల్లో జోష్ ఎంత?!
ఏపీలో కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ ఈ నెల 27-29 వరకు మహానాడును నిర్వహించనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 21 May 2025 11:17 PM ISTఏపీలో కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ ఈ నెల 27-29 వరకు మహానాడును నిర్వహించనున్న విషయం తెలిసిందే. అది కూడా పార్టీ చరిత్రలో తొలిసారి.. కడపలోని కమలాపురం నియోజకవర్గంలో మహానాడును నిర్వహిస్తున్నారు. దీనికి చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక, మహానాడును ఘనంగా నిర్వహించేందుకు.. ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమ య్యాయి. మంత్రులు, అగ్రనాయకులు, సీనియర్లతో కలిపి 19 మహానాడుకమిటీలను కూడా పార్టీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఇక, దీనికి ముందు మినీ మహానాడులకు ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విజయం దక్కించుకున్న నియోజకవర్గాలతో(134)పాటు.. పోటీ చేయని, ఓడిన నియోజకవర్గాల్లోనూ.. మినీ మహానాడును నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సీనియర్ నాయకులకు చంద్రబాబు ఆదేశించారు. ఇది జరిగి వారం అయింది. వాస్తవానికి మహానాడుకు ముందు వీటిని ఘనంగా నిర్వహించి.. మహానాడు స్ఫూర్తిని ప్రజలకు తెలిసేలా చేయాలన్నది.. పార్టీ పుంజుకునేందుకు వీటిని వెపన్‌గా వాడాలన్నది సీఎం చంద్రబాబు ఉద్దేశం. ఈ క్రమంలోనే పార్టీ నాయకులకు కీలక మినీ మహానాడుబాధ్యతలను అప్పగించారు.
మరోవైపు.. మినీ మహానాడులు నిర్వహించి కూడా ఆరేళ్లు దాటింది. మహానాడులు నిర్వహిస్తున్నా.. మినీ మహానాడులను మాత్రం.. గత ఆరేడేళ్లుగా నిర్వహించడం లేదు. గత ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉండడం.. దీనికి ముందు ఎన్నికలు రావడంతో మహానాడుకే పార్టీ పరిమితం అయింది. ఇదిలావుంటే.. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపును ఎంత మంది అందిపుచ్చుకున్నారన్నది చూస్తే.. ప్రశ్నార్థకంగానే మారుతోంది. దీనికి కారణం.. మినీ మహానాడులను కొన్ని నియోజకవర్గా లకే పరిమితం చేసినట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు.
మరికొన్నిచోట్ల తూతూ మంత్రంగా మినీ మహానాడులను నిర్వహిస్తున్నారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీసి.. అధినేత చంద్రబాబు కన్నీళ్లు తుడవడానికి అన్నట్టుగా నిర్వహిస్తున్నారు. ఇక, ఇక్కడే మరో గమ్మత్తయిన విషయం ఉంది. ఇప్పటి వరకు తమ గోడు వెళ్లబోసుకునేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు కనిపించకపోవడంతో .. మినీ మహానాడు వేదికలుగా.. క్షేత్రస్థాయి నాయకులు, గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు.. మినీ మహానాడులకు వచ్చి.. తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. మంగళవారం నాటి మినీ మహానాడులో అనంతపురంలో ఓ నాయకుడు తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఎలుకల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇలా.. మినీ మహానాడుల్లో జోష్ లేకపోగా.. అంతర్గత కుమ్ములాటలకు ఇవి వేదికలుగా మారుతున్నాయి.
