రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు.. ఆరేళ్ల తర్వాత.. నిర్ణయం..!
అంతేకాదు, స్థానికంగా పార్టీ కోసం బలంగా పనిచేస్తున్న కార్యకర్తల పేర్లను సూచించాలని కూడా చంద్ర బాబు తెలిపారు.
By: Tupaki Desk | 15 May 2025 4:15 PMరాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మినీ మహానాడులకు పిలుపునిచ్చింది. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే.. దాదాపు ఆరేళ్ల తర్వాత పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. టీడీపీ అధికారంలో ఉన్న 2014-19 మధ్య తొలిసారి మినీ మహానాడులకు శ్రీకారం చుట్టింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో అప్పట్లో వీటిని నిర్వహించారు.
తద్వారా.. పార్టీ కార్యక్రమాలు, పార్టీ వ్యూహాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా ప్రయత్నించారు. ఎంపీ లను, ఎమ్మెల్యేలను భాగస్వాములను చేసి క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకునేలా వ్యవహరించారు. ఇది పార్టీకి బాగా కలిసి వచ్చింది. మహానాడును మరింత సామర్థ్యంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది. ఇలా 2019 వరకు నిర్వహించారు. ఆ తర్వాత.. ఎన్నికల్లో ఓడిన దరిమిలా.. కేవలం మహానాడుకు మాత్రమే పరిమితమయ్యారు. అది కూడా.. కరోనా సమయంలో ఆన్‌లైన్‌లోనే మహానాడును పరిమితం చేశారు.
ఇక, గత ఐదేళ్లలో మినీ మహానాడులు నిర్వహించలేదు. వైసీపీ అధికారంలో ఉండడం.. నాయకులుకూడా ఒకింత ఆవేదనలో ఉండడం, కేసులు, కోర్టులు, బెయిళ్లు వంటివాటితో నాయకులు తీరిక లేకుండా ఉన్న నేపథ్యంలో పార్టీ మినీ మహానాడులను నిర్వహించలేక పోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ నెల 22-23 తేదీల్లో మినీ మహానాడులు నిర్వహించాలనిచంద్రబాబు తేల్చి చెప్పారు. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
అంతేకాదు, స్థానికంగా పార్టీ కోసం బలంగా పనిచేస్తున్న కార్యకర్తల పేర్లను సూచించాలని కూడా చంద్ర బాబు తెలిపారు. తద్వారా మహానాడు వేదికగా.. యూత్ వింగ్‌ను బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో పార్టీ క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగాలన్న విషయాలపై కూడా.. నాయకులు సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ నెల 22-23 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడులు నిర్వహించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు సమాయత్తం అవుతున్నారు.