టీడీపీలో 'భారీ' మార్పు....?
కూటమి ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న టీడీపీలో భారీ మార్పు వస్తోందా? ఆ పార్టీలో కీలక నిర్ణ యం తీసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 27 March 2026 12:00 AM ISTకూటమి ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న టీడీపీలో భారీ మార్పు వస్తోందా? ఆ పార్టీలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. భారీ మార్పుల దిశగా పార్టీలో అడుగులు పడుతున్నాయని సీనియర్లు చెబుతున్నారు. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఇక, ప్రధాన కార్యక్రమాన్ని అమరావతి లేదా విజయవాడలో నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే.. ఈ కార్యక్రమం వేదికగానే.. పార్టీలో భారీ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ పదవిని చేపట్టడం ఇది నాలుగోసారి. ఈ నెల 29న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మరో సారి కూడా.. ఆయన ఈ పదవికి ఎంపిక అయితే.. అది 5వ సారి అవుతుంది.
కానీ, ఇక్కడ నారా లోకేష్ కీలక ప్రతిపాదన చేశారు. ఏ పదవి అయినా.. రెండు సార్లకు లేదా.. మూడు సార్లకు మించి ఇవ్వరాదని సూచిస్తున్నారు. గత ఏడాది కూడా ఆయన ఇదే విషయం చెప్పారు. ఇటీవల కూడా.. ఈ విషయాన్ని మరింత గట్టిగా చెప్పుకొచ్చారు. తాను ఇప్పటికే నాలుగు సార్లు ఈ పదవిని చేపట్టానని.. ఇక, చాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఊహించని మార్పులు ఉంటాయని కూడా ఆయన వెల్లడించారు.
సో.. దీనిని బట్టి.. నారా లోకేష్‌కు పదవి విషయంలో భారీ మార్పు కనిపించనుంది. అయితే.. జాతీయ ప్ర ధాన కార్యదర్శి పదవి అనేది.. జాతీయ అధ్యక్షుడి పదవి తర్వాత రెండో స్థానంలో ఉంది. దీనికి మించిన మూడో పదవి లేదు. కాబట్టి.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇవ్వాలని అనుకుంటే.. జాతీయ అధ్యక్షుడి పదవిని ఇవ్వాలి. కానీ.. చంద్రబాబు ఈ పదవిని ఇవ్వాలని భావించడం లేదు. ఈ క్రమంలోనే కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్షుడు(వర్కింగ్ ప్రెసిడెంట్) పదవిని సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి నారా లోకేష్‌ను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ఈ భారీ మార్పు పై పార్టీలో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం.
