'షడ్రుచుల మహానాడు'.. తిన్నవారికి తిన్నంత.. !
పెద్ద పెద్ద గాడి పొయ్యిలు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వంటకాల్లో నిపుణులైన వారిని రప్పిస్తారు.
By: Tupaki Desk | 26 May 2025 7:00 AM ISTఏపీలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే మహానాడులో అందరినీ అమితంగా ఆకర్షించేది షడ్రుచులే!. ఎవరు ఏం చెప్పినా.. అందరి చూపూ వంటకాలపైనే ఉంటుంది. ఇది మహానాడులో ఏర్పాటు చేసే ఇతర విశేషాలతో పోల్చితే అత్యంత ముఖ్యమైన ఘట్టం. షడ్రుచుల సమ్మేళనం. ఇది మరోరూపంలో మహానాడును `షడ్రుచుల నాడు`గా మార్చేస్తుందనడంలోనూ సందేహం లేదు. అంతేకాదు.. అతిథులు, కార్యకర్తలు, నాయకుల సంఖ్యతో సంబంధం లేకుండా.. ఉజ్జాయింపుగా ఓ సంఖ్యను అనుకుని ప్రత్యకంగా వంటకాలు చేయిస్తారు.
పెద్ద పెద్ద గాడి పొయ్యిలు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వంటకాల్లో నిపుణులైన వారిని రప్పిస్తారు. దీనిని ప్రాథమికంగా కాంట్రాక్టుకు ఇచ్చినా.. తర్వాత మాత్రం పూర్తిగా మహానాడు వంటల కోసం ప్రత్యేకంగా పార్టీ అధినేత నియమించిన కమిటీ స్వాధీనం చేసుకుంటుంది. ప్రతి వంటకాన్నీ ఈ కమిటీ రుచి చూస్తుంది. పచ్చడి నుంచి పరమాన్నం వరకు అన్నీ రుచి చూసి.. సంతృప్తి చెందితేనే వాటిని వడ్డిస్తారు. ఇక, ఈ వంటకాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. సీజనల్ గా వచ్చే కూరగాయలను తాజావి అప్పటికప్పుడు తెప్పించి వంటకాలు చేయిస్తారు.
ఇలా.. ఒకటా రెండా.. దాదాపు 20-30 రకాల వంటకాలు తమ్ముళ్ల జిహ్వా చాపల్యానికి పెద్ద పరీక్షే పెడతాయి. కాకినాడ కాజా ఒకప్పటి మాట.. ఇప్పుడంతా లేటెస్టు.. బాసుంది నుంచి బాదం హల్వా వరకు అన్నట్టుగా ప్రత్యేక వంటకాలతో తమ్ముళ్లకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర మాత గోంగూరతో కలిపి నాన్ వెజ్, వెజ్‌వంటకాలు.. నోరూరిస్తాయి. అంతేకాదు.. రోజూఉదయం టిఫిన్‌లోనే నాలుగు నుంచి ఆరు రకాలు ఉంటాయి. ఇడ్లీ, వడ, ఉప్మా, కట్టి పొంగలి, దోశల(ఆరు రకాలు) వరకు అప్పటికప్పుడు వేడివేడి పొగలు కక్కుతున్న సమయంలోనే వడ్డిస్తారు. వీటిలోకి నాలుగు రకాల చట్నీలు, సాంబారు కూడా రెడీ అవుతాయి.
ఇక, మద్యాహ్నం షడ్రశోపేతమైన భోజనంవడ్డిస్తారు. దీనిలో పప్పు, రెండు మూడు రకాల ఇగుర్లు, రెండు రకాల వేపుళ్లు, పులుసు కూరలు.. సాంబారు, రసం, మచ్చిగ చారు.. ఇలా.. అనేక రకాలు ఉంటాయి. ఇక, సాయంత్రం.. భోజనాని బదులుగా బిర్యానీ, చపాతీ, పుల్కా, పరోటా వంటివి చేస్తారు. వీటిలోకి కూడా కుర్మా సహా .. రెండు రకాల కూరలు వడ్డిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోయినా.. రాసుకుంటూ పోయినా.. మహానాడు తెరవెనుక భోజనాల కోసం జరిగే మహా క్రతువుకు అంతు లేదు. కార్యక్రమాలు మూడు రోజులపాటు భోజనాలు, పిండి వంటలు.. ప్రతి ఒక్కరినీ చవులూరిస్తాయి.
