జెన్ ఆల్ఫా.. లోకేష్ ఫ్యూచర్ రెడీ ప్లాన్?
తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు తొలిరోజే ఒక స్పష్టమైన రాజకీయ దిశను చూపెట్టిందనే చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 28 May 2026 11:41 AM ISTతెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు తొలిరోజే ఒక స్పష్టమైన రాజకీయ దిశను చూపెట్టిందనే చర్చ జరుగుతోంది. పసుపు పండుగ వేదికగా టీడీపీ కేవలం ప్రస్తుత రాజకీయాల గురించే మాట్లాడటానికే పరిమితం కాకుండా, రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ పాలసీకి సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ఏకకాలంలో రెండు వేర్వేరు తరాలను ఆకట్టుకునేలా వ్యూహాత్మకంగా ప్రసంగించారని అంటున్నారు . ఒకవైపు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి వస్తున్న వస్తున్న పాత క్యాడర్ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూనే మరోవైపు గ్లోబల్ ట్రెండ్స్ కు తగ్గట్టు జెన్ జీ, జెన్ ఆల్ఫా అంటూ కొత్త తరాన్ని ఆకర్షించేలా మంత్రి లోకేశ్ ప్రకటనలు ఉన్నాయని అంటున్నారు. మహానాడు తొలిరోజు తీసుకున్న నిర్ణయాలు, ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రసంగం గమనిస్తే టీడీపీ తనను తాను ఒక 'ఫ్యూచర్ రెడీ' డిజిటల్ పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని విశ్లేషిస్తున్నారు.
'జెన్ ఆల్ఫా'పై తొలిసారిగా చర్చ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జెన్ జీ కోసమే చర్చ జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ రాజకీయ, సామాజిక ఉద్యమం జరిగినా దాని వెనుక జెన్ జీ యువతే ఉంటున్నారు. తాజాగా ఆన్ లైన్ సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా జెన్ జీ ప్రభావమే అని విశ్లేషిస్తున్నారు. జెన్ జీ అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు. అంటే దాదాపు 30 ఏళ్లలోపు ఉన్న యువత సామాజిక మాధ్యమాల్లోనూ సామాజిక కార్యక్రమాల్లోనూ ఎక్కువగా ప్రభావితమవుతున్నారని చెబుతున్నారు. ఈ తరాన్ని ఆకట్టుకోవడంతోపాటు వారి తర్వాత వచ్చే తరాన్ని ఆకర్షించేలా ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించడం ఆసక్తికర చర్చగా మారిందని అంటున్నారు. మహానాడు వేదికగా జెన్ జీతోపాటు జెన్ ఆల్ఫా కోసమూ తాము పనిచేస్తున్నామని, వారికి గొప్ప అవకాశాలు ఉన్నాయని లోకేశ్ ప్రకటించారు. దీంతో జెన్ ఆల్ఫా గ్రూప్ పై చర్చ మొదలైంది. 2010 నుంచి 2024 మధ్య జన్మించిన పిల్లలను జెన్ ఆల్ఫా తరంగా పిలుస్తున్నారని చెబుతున్నారు.
లోకేష్ లాంగ్ టర్మ్ ఫోకస్
ప్రస్తుతం జెన్ జీ ఓటర్లను ఆకట్టుకునేందుకే రాజకీయ పార్టీలు ఆరాటపడుతుండగా, యువనేత నారా లోకేష్ ఒకడుగు ముందుకు వేసి 'జెన్ ఆల్ఫా' పేరు ప్రస్తావించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ఒక ప్రసంగ పాఠమే కాదని, రాబోయే 15-20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి టీడీపీ సిద్ధమవుతోందనడానికి సంకేతంగా చూడాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఏఐ సిటీ, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సాంకేతిక అంశాలను లోకేష్ నిరంతరం ప్రస్తావించడం వెనుక ఉద్దేశం ఇదే అంటున్నారు. సాంకేతికతతో పెరిగే 'జెన్ ఆల్ఫా' మానసిక స్థితికి తగ్గట్టుగా పార్టీని ఇప్పటి నుంచే మలచాలనేది లోకేశ్ వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
33% మహిళా టికెట్లు
ఈ ఫ్యూచర్-రెడీ మైండ్‌సెట్ మహానాడు నిర్వహణలోనూ స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. భౌతికంగా హాజరైన క్యాడర్‌తో పాటు డిజిటల్ మాధ్యమాల ద్వారా లక్షలాది మందిని అనుసంధానిస్తూ నిర్వహించిన 'హైబ్రిడ్ మహానాడు' సాంకేతికతకు అద్దం పట్టిందని చెబుతున్నారు. దీనికి తోడు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయిస్తామని లోకేష్ ప్రకటించడం అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఇటు సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూనే, అటు భవిష్యత్తు రాజకీయాల్లో మహిళా నాయకత్వాన్ని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
భావోద్వేగానికి.. టెక్నాలజీకి ముడిపడేనా?
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్ అత్యంత కఠినమైన సవాల్ స్వీకరించారని అంటున్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, సంక్షేమ పథకాలు, పాత తరం గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్‌ను వదలకుండా... ఈ సరికొత్త 'జెన్ జీ', 'జెన్ ఆల్ఫా' టెక్నాలజీ విజన్‌తో ఎలా అనుసంధానిస్తారు అనేది చూడాల్సివుందని అంటున్నారు. ఈ సరికొత్త 'టూ-జెనరేషన్' పొలిటికల్ థియరీ వినడానికి, వెబ్ వేదికలపై చర్చించడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అంత సులభంగా అమలవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాత క్యాడర్ ఇంకా సాంప్రదాయ రాజకీయ శైలిలోనే ఉన్నారని వారిని డిజిటల్ ఓటర్ల ఆలోచనలకు అనుగుణంగా మార్చడం పెద్ద సవాల్ గా చెబుతున్నారు.
