Begin typing your search above and press return to search.

తిరుగుతోంది లోకేష్ చక్రం... .మహానాడు సంచలనం !

లోకేష్ యువ నేతగా ఉన్నారు. యూత్ ని ఆయన ఆకట్టుకుంటున్నారు దాంతో భవిష్యత్తు నేతగా ఆయనను ప్రొజెక్ట్ చేయడమే ఈసారి మహానాడులో అతి ముఖ్య అంశంగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   15 May 2025 8:00 AM IST
తిరుగుతోంది లోకేష్ చక్రం... .మహానాడు సంచలనం !
X

మరి కొద్ది రోజులలో తెలుగుదేశం పార్టీ మహానాడు అత్యంత ఘనంగా జరగబోతోంది. ఈ మహానాడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పార్టీ పుట్టి 43 ఏళ్ళు ఈ ఏడాదికి పూర్తి అయ్యాయి. అంతే కాదు తెలుగుదేశం ఏర్పడిన తరువాత ఇప్పటికి ఆరు సార్లు అధికారంలోకి వచ్చింది. అత్యధిక కాలం సీఎం గా చంద్రబాబు ఉన్నారు. ఇక పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మూడు సార్లు సీఎం గా ఏడున్నరేళ్ళ పాటు పాలిస్తే చంద్రబాబు ఇప్పటికి నాలుగు సార్లు సీఎం గా పదిహేనున్నరేళ్ళ పాటు ఉన్నట్లు అయింది. మరో నాలుగేళ్ళ కాలం పూర్తి అయితే బాబు రెండు దశాబ్దాల పాటు తెలుగు నాట పాలించిన సీఎం గా అరుదైన రికార్డు స్థాపిస్తారు.

దాంతో పాటు తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ చూడని కనీ వినీ ఎరగని విజయం దక్కింది. ఏకంగా 94 శాతానికి పైగా సీట్లు పార్టీ పరం అయ్యాయి. అలాగే 58 శాతం పైగా ఓటు షేర్ దక్కింది. ఇది టీడీపీకి అపూర్వ విజయం. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉంది. ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలే ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రధాని మోడీ సైతం చంద్రబాబుకు అత్యంత గౌరవం ఇస్తున్నారు.

కోరుకున్న విధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అలాగే పోలవరం పూర్తి అయితే బాబు చరిత్రలో నిలిచిపోతారు. ఏపీలో విపక్షం పెద్దగా లేని పరిస్థితి. ఏ విధంగా చూసిన సర్వం పాజిటివ్ గా ఉన్న నేపధ్యం కనిపిస్తోంది.

దాంతో ఈసారి మహానాడులో అనేక కీలక నిర్ణయాలు ఉంటాయని ప్రత్యేకించి నారా లోకేష్ కి ప్రమోషన్ ఉంటుందని అంటున్నారు చంద్రబాబు పార్టీ బాధ్యతలు మొత్తం ఆయనకు ఇప్పటికే అప్పగించారు అని ప్రచారం సాగుతోంది. అయితే బాబు జాతీయ ప్రెసిడెంట్ గా ఉంటూనే వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న పదవికి జాతీయ స్థాయిలో క్రియేట్ చేసి దానిని లోకేష్ కి ఇస్తారు అని అంటున్నారు.

దాంతో పార్టీలో మొత్తం బాధ్యతలు అన్నీ లోకేష్ కి దఖలు పడతాయని అంటున్నారు. బాబు పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఇక ప్రభుత్వం మీద ఫుల్ ఫోకస్ బాబు పెడతారు అని అంటున్నారు. లోకేష్ కి పార్టీలో కీలకమైన స్థానం ఇవ్వాలని ఇప్పటికే ఆయన టీం గట్టిగా కోరుతూ వస్తోంది.

ఆ మాటకు వస్తే ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని గతంలో డిమాండ్లు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం కావడం, మిత్రులు కూడా ప్రభుత్వంలో ఉండడంతో అది వీలు పడలేదు. కానీ పార్టీ అయితే తమ ఆలోచనల ప్రకారం ఏమైనా చేయవచ్చు అని అంటున్నారు. దాంతో లోకేష్ కి ఈసారి మహానాడు కలకాలం గుర్తిండిపోయేలా అతి పెద్ద బహుమతినే ఇస్తుందని అంటున్నారు.

లోకేష్ యువ నేతగా ఉన్నారు. యూత్ ని ఆయన ఆకట్టుకుంటున్నారు దాంతో భవిష్యత్తు నేతగా ఆయనను ప్రొజెక్ట్ చేయడమే ఈసారి మహానాడులో అతి ముఖ్య అంశంగా చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో. ఏది ఏమైనా లోకేష్ తోనే ఈసారి మహానాడు అని అంతా అంటున్నారు.