బండెనక బండి కట్టి.. మహానాడుకు తమ్ముళ్ల శోభ..!
ఇప్పుడు మహానాడుకు ముందు రోజు.. కడప పేరును పూర్తిస్థాయిలో జిల్లాకు ఉంచుతూ.. వెంటనే చర్యలు తీసుకోవాలని.. కడప కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
By: Tupaki Desk | 26 May 2025 10:58 PM ISTటీడీపీపసుపు పండుగ మహానాడుకు కొన్ని గంటలే సమయం ఉంది. మంగళవారం ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధికారికంగా జ్యోతిని వెలిగించి.. మహానాడును ప్రారంభించనున్నారు. కడప జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడును ధూం ధాంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. అదేసమయంలో కడప ప్రజల కోరిక మేరకు.. మహానాడుకు ముందు రోజు.. ఈ జిల్లా పేరులో ఉన్న `కడప`ను తిరిగి తీసుకువచ్చారు. గతంలో వైసీపీ కడప పేరును మాయం చేసి.. కేవలం వైఎస్సార్ పేరునే పరిమితం చేశారు.
ఇప్పుడు మహానాడుకు ముందు రోజు.. కడప పేరును పూర్తిస్థాయిలో జిల్లాకు ఉంచుతూ.. వెంటనే చర్యలు తీసుకోవాలని.. కడప కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రభావంతో మహానాడుకు కడప మరింత ఆనందిస్తుందనిపార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా టీడీపీ శ్రేణులు కడప కు క్యూ కట్టారు. కడపకు వెళ్లే జాతీయ రాష్ట్ర రహదారులు తమ్ముళ్ల వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఎందుకంటే.. చాలా మంది నాయకులు ర్యాలీలుగా తమ తమ నియోజకవర్గాల నుంచి కడపకు వెళ్తున్నారు.
శ్రీకాకుళం నుంచి వందలాది వాహనాలు.. సోమవారం మధ్యాహ్నం బయలు దేరాయి. అదేవిధంగా విజయవాడ నుంచి 200 మంది పసుపు కార్యకర్తలు సైకిల్ ర్యాలీగ మహానాడుకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరునుంచి బైకులపై, పెనుకొండ నుంచి సైకిళ్లపై.. ఇలా పార్టీపైఊ నాయకులు కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు.. తొలిరోజే 50 వేల మంది వరకు కార్యకర్తలు వస్తారని అంచనా వేసుకున్న నాయకులు ఆమేరకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.
ఇక, రెండో రోజు నాటికి లక్ష మంది.. మూడో రోజు నాటికి మూడు లక్షల మందికిపైగా కార్యకర్తలే వస్తారని అంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, భోజన సదుపాయాలను కూడా నిర్విరామంగా చేస్తున్నారు. మరోవైపు వర్షాల ప్రభావాన్ని కూడా ముందుగానే అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతటి వర్షం వచ్చినా.. మహానాడుకు ఇబ్బంది లేకుండా.. చూస్తున్నారు. విద్యుత్‌ను నిరంతరాయంగా ఉండేలా చూసుకుంటున్నారు. 150కి పైగా జనరేటర్లను రెడీ చేసుకున్నారు. మొత్తానికి ఈ మహానాడును ధూంధాంగా నిర్వహించేందుకు తమ్ముళ్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
