కడపలో మహానాడు నిర్వహించాలన్న ఆలోచన ఎవరిది? వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరు..?
కానీ, అప్పట్లోనే కడప గడ్డపై మహానాడు వేడుక నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేసిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 26 May 2025 7:55 PM ISTదేవుడి గడపగా చెప్పే కడపలో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే టీడీపీ పెద్ద పండుగకు సర్వం సిద్ధమైంది. నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ కడపలో మహానాడు నిర్వహించలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి.. ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి కోటగా భావించే కడప ఇప్పుడు పసుపు తోటగా మారపోయింది. ఎక్కడ చూసినా టీడీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. చరిత్రను తిరగరాసేలా టీడీపీ నిర్వహిస్తున్న ఈ మహానాడు ప్రత్యేకతలేంటి? కడపలోనే మహానాడు నిర్వహణకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అంటే బలమైన కారణమే ఉందంటున్నారు. ఆ కారణం పేరే నారా లోకేష్.
మహానాడు అంటే టీడీపీ పెద్ద వేడుక. గత ఏడాది ఎన్నికలు సందర్భంగా ఈ పెద్ద పండగను టీడీపీ వాయిదా వేసుకుంది. కానీ, అప్పట్లోనే కడప గడ్డపై మహానాడు వేడుక నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేసిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పని అయిపోయిందని చాటిచెప్పేందుకు కడపలోనే సత్తా చాటాలని భావించింది టీడీపీ అధిష్టానం. అయితే అప్పట్లో అది కుదరకపోవడంతో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏడాదికి అదే వేదికపై మహా పండుగ చేయాలని నిర్ణయించింది. దీనికి ప్రధానంగా యువనేత లోకేశ్ పట్టుదల ఉందని అంటున్నారు.
నాలుగున్నర దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఆ పార్టీకి పట్టుచిక్కని నియోజకవర్గాలు ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయని చెబుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ప్రాంతమైనా.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోపాటు రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. అయితే, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఖతమైనా, టీడీపీకి మాత్రం పట్టుచిక్కలేదు. దీనికి కారణం ఆ పార్టీ స్థానంలో వైసీపీ ఆవిర్భవించడమే. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. ముఖ్యంగా రాయలసీమలోని ఉమ్మడి జిల్లాల్లో కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో రాయలసీమలో పార్టీని పటిష్టం చేయాలని యువనేత లోకేశ్ సంకల్పం తీసుకున్నారని చెబుతారు.
గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన లోకేశ్.. రాయలసీమ నుంచే తన కార్యక్రమం ప్రారంభించారు. ఇక ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర ద్వారా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి.. ఈ ప్రాంత సర్వోతోముఖాభివృద్ధికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలో అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యేలా అడుగులు వేశారు. ఇందులో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ హబ్, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్, శ్రీసిటీలో పరిశ్రమలు, అనంతపురం జిల్లాలో రెన్యూ ఎనర్జీ వంటి అనేక ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు సృష్టించారు.
కొద్దికాలంలో ఇవన్నీ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు, పనుల ద్వారా రాయలసీమలో పునాదులు గట్టి చేసుకోవాలని యువనేత లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు. తన యువగళం ద్వారా ఈ ప్రాంతం యువత ఆలోచనలు, వారి అవసరాలు తెలుసుకున్న లోకేశ్ తను కూడా ఈ ప్రాంతానికి చెందిన వాడినన్న భావోద్వేగం కలిగించాలని చూస్తున్నారని అంటున్నారు. రాయలసీమ తమకు ఎంతో ప్రాధాన్యమని చాటి చెప్పేందుకు మహానాడును ఈ ప్రాంతంలోనే నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా రాయలసీమకు రాజధాని వంటి కడప వైఎస్ కుటుంబానికి ఇన్నాళ్లు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని పూర్తిగా దెబ్బతీసిన టీడీపీ కూటమి ఇక ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే అడుగులు వేస్తోంది. మహానాడు కూడా ఇందుకు సరైన వేదికగా భావిస్తున్నారు. ఇటు అభివృద్ధి, అటు రాజకీయంగా ఏ విధంగా చూసినా టీడీపీయే రాయలసీమకు ప్రాధాన్యం ఇస్తుందని చెబుతున్న లోకేశ్ కడప నుంచే ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. అందుకే కడపలో మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
