మహానాడుకు ముందు - తర్వాత..!
ఈ నెల 27-29 మధ్య టీడీపీ పసుపు పండుగ మహానాడుకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. అది కూడా.. ఇప్పటి వరకు నిర్వహించని కడప జిల్లాలో తొలిసారి మహానాడుకు శ్రీకారం చుట్టారు.
By: Tupaki Desk | 20 May 2025 11:00 AM ISTఈ నెల 27-29 మధ్య టీడీపీ పసుపు పండుగ మహానాడుకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. అది కూడా.. ఇప్పటి వరకు నిర్వహించని కడప జిల్లాలో తొలిసారి మహానాడుకు శ్రీకారం చుట్టారు. దీంతో ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. అయితే.. మహానాడు విషయంలో ఈ దఫా సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నాయకుల మార్పును కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. మహానాడు తర్వాత మార్పు రావాలని కోరుకుంటున్నారు.
''ఇప్పటి వరకు ఎలా ఉన్నారో.. అంతా నాకు తెలుసు. మీరు కవర్ చేయొద్దు. ఇక, నుంచి మార్పు రావాలి. 2024 ఫలితాలను మించి.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలి. ప్రధానంగా కూటమి కొనసాగుతుం ది. దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదు. మీరు మారకపోతే.. మేమే మిమ్మల్ని మార్చాల్సి ఉంటుం ది'' అని తాజాగా మహానాడు కమిటీలను ఏర్పాటు చేస్తూ.. చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీనిని బట్టి మహానాడుకు ముందు.. తర్వాత.. మార్పు ఖాయమన్న చర్చ తెరమీదికి వచ్చింది.
ప్రస్తుతం ఎమ్మెల్యేల నుంచి నాయకుల వరకు కూడా.. క్షేత్రస్థాయిలో ఎవరికి వారుగా ఉన్నారు. ఎవరి 'పని' వారు చేసుకుంటున్నారు. దీనివల్ల పార్టీ కార్యక్రమాల కంటే కూడా.. తమ వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది పార్టీకి నష్టం కలిగిస్తోంది. ఇటీవల కర్నూలులో చంద్రబాబు పర్యటించినప్పుడు జనాల తరలింపు విషయంలో నాయకులు చేసిన పని.. చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో జనాలు లేరన్న విషయాన్ని ఆయనే స్వయంగా సభలో చెప్పుకొచ్చారు.
అయితే.. దీనిని అప్పటికి కవర్ చేసుకున్నా.. నాయకుల తీరును మాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. ఎన్ని పనులు ఉన్నా.. ఎట్టిపరిస్థితిలోనూ.. పార్టీకి ప్రాధాన్యం ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహానాడు వేదికగా.. నాయకులకు బలమైన సంకేతాలు, సందేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే.. ముందుగానే సీనియర్ నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీనిని బట్టి మహానాడు .. పార్టీ దశ-దిశను సంపూర్ణంగా మారుస్తుందని అంటున్నారు పార్టీ నాయకులు.
