Begin typing your search above and press return to search.

మహానాడు వేదికగా టీడీపీ లో భారీ మార్పులు ?

తెలుగుదేశం పార్టీకి మహానాడు అన్నది అతి పెద్ద పండుగ. పార్టీ ప్రతీ ఏటా ఎంతో వైభవంగా ఘనంగా నిర్వహిస్తూ వస్తూంది.

By:  Tupaki Desk   |   2 May 2025 11:00 AM IST
TDP Mahanadu 2025 Youth Power Rises
X

తెలుగుదేశం పార్టీకి మహానాడు అన్నది అతి పెద్ద పండుగ. పార్టీ ప్రతీ ఏటా ఎంతో వైభవంగా ఘనంగా నిర్వహిస్తూ వస్తూంది. ఇది ఒక సంప్రదాయంగా మారడమే కాదు పార్టీ జనాలతో పాటు సాదర జనాలకు కూడా టీడీపీ మహానాడు ఎంతో ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది.

ప్రతీ ఏటా టీడీపీ వ్యవస్థాపకుడు ఎంటీఆర్ జన్యదినం వేళ మహానాడు జరుగుతుంది. మే 27 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తే అందులో మే 28 అన్న గారి పుట్టిన రోజుగా ఉంటుంది. దేశంలో కానీ వివిధ రాష్ట్రాలలో కానీ ఏ పార్టీ మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున పార్టీ పండుగను నిర్వహించిన దాఖలాలు లేవు.

ఆ రికార్డు కేవలం టీడీపీకే సొంతం అని చెప్పాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎన్నో మహానాడులు జరిగాయి, టీడీపీ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈసారి మహానాడులో పెను సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు ఈసారి మహానాడు వేదికగా టీడీపీలో సంస్థాగతంగా భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు.

టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి అయిన నారా లోకేష్ పదే పదే ఇటీవల కాలంలో ఒక మాట చెబుతూ వస్తున్నారు. ఎంతటి సీనియర్ అయినా మూడు సార్లు వరసగా ఒకే పదవులు నిర్వహిస్తే కనుక వాటి నుంచి తప్పుకోవాలని సూచించారు. విరామం ఇచ్చి జూనియర్లకు ఆ పదవులలో చాన్స్ ఇవ్వాలని కూడా ఆయన ప్రతిపాదించారు. అది తనతోనే మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లుగా కూడా చెప్పారు.

ఇక చూస్తే టీడీపీలో ప్రస్తుతం నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ మహానాడు తరువాత ఆయన జాతీయ కార్యనిర్వహణ అధ్యక్ష పదవిలోకి వెళ్తారు అని అంటున్నారు. అలాగే పార్టీకి ప్రాణం అయిన పొలిట్ బ్యూరోలో కూడా పెను మార్పులు చేస్తారని అక్కడ యువ రక్తానికి కొత్త ముఖాలకు చాన్స్ ఇస్తారని అంటున్నారు.

ఈ మేరకు మహానాడులో తీర్మానం చేసి ఆమోదిస్తారని అంటున్నారు. ఆ తీర్మానం అనుసరించి జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పదవుల నియామకాలలో కొత్త నీరుకు యువతకు అత్యధిక అవకాశాలు ఇస్తారని అంటున్నారు ఆ విధంగా యువతకు పెద్ద పీట వేస్తూనే సీనియర్లకు నెమ్మదిగా రాజకీయ విరామాన్ని ప్రకటిస్తారు అని అంటున్నారు.

ఇక మహానాడు తరువాత పార్టీలో లోకేష్ ప్రాధాన్యత కానీ ఆయనకు దక్కిన పదవుల విషయంలో కానీ ఎంతో మార్పు ఉంటుందని ఒక విధంగా లోకేష్ కి అత్యంత కీలకమైన స్థానం దక్కబోతోంది అని ప్రచారం అయితే సాగుతోంది. అలాగే మహానాడులో చేసిన తీర్మానాల మేరకు పార్టీలో కొత్త నియామకాలను జూన్ లో ప్రకటించే చాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి ఈసారి మహానాడులో అనేక మార్పులు ఉంటాయని పార్టీలో సమూలమైన ప్రక్షాళనకు నాంది పలుకుతారని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.