Begin typing your search above and press return to search.

మహానాడులో కనిపించని నందమూరి!

ఇంతటి దిగ్విజయంగా మహానాడు జరిగితే బాలయ్య ఏరీ అన్న చర్చ మరో వైపు సాగింది.

By:  Tupaki Desk   |   29 May 2025 11:00 PM IST
మహానాడులో కనిపించని నందమూరి!
X

మహానాడు ఎన్నడూ లేని విధంగా కడప గడపలో మూడు రోజుల పాటు సాగింది. మహానాడు విజయవంతం కూడా అయింది. అంతటా నారా నామస్మరణంతో తరించింది. నారా లోకేష్ ని భావి వారసుడిగా ఘనమైన ఆమోదముద్ర వేసింది. ఇక ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆసరాతో నా మనవడు లోకేష్ నా వారసుడు అని సీనియర్ ఎన్టీఅర్ చేత పలికించడం.

అదే విధంగా తాను లేని తెలుగుదేశం పార్టీ గడచిన దశాబ్దాల నుంచి నేటి వరకూ ఏ విధంగా సక్సెస్ ఫుల్ గా సాగుతూ అనేక కార్యక్రమలాను అమలు చేసిందో కూడా సీనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయకత్వ ప్రతిభను కూడా ఏఐ ద్వారా రూపొందించిన సీనియర్ ఎన్టీఆర్ బాగానే పొగిడారు. మొత్తానికి నందమూరి వారు స్థాపించిన టీడీపీకి అసలైన వారసులు నారా వారే అని ఏఐ ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ఆమోదముద్ర వేశారు.

అలా చంద్రబాబు తరువాత వారసుడు ఎవరు అన్నది కూడా స్పష్టమైపోయింది. ఇంతటి ఘనమైన కార్యక్రమమానికి ఎన్టీఆర్ వారసులుగా ఉన్న వారు ఎవరూ కనిపించలేదు. మహనాడులో నందమూరి వారు ఎక్కడా కనిపించలేదు వారూ వీరూ ఎందుకు అసలైన వారసుడు నందమూరి బాలకృష్ణ ఎక్కడా కానరాలేదు.

ఇంతటి దిగ్విజయంగా మహానాడు జరిగితే బాలయ్య ఏరీ అన్న చర్చ మరో వైపు సాగింది. ఆయన మామూలు వారు కాదు, ఎన్టీఆర్ ఒకనాడు ముఖ్యమంత్రిగా ఉండగా నా రాజకీయ వారసుడు బాలయ్యే అని చాటి చెప్పిన వారు. ఆనాడు ఏఐలు లేవు, ఆ చిలక పలుకులూ లేవు స్వయంగా అన్న గారు తన కంచు కంఠంతో చెప్పిన మాటలు అవి.

అదంతా 1987లో జరిగిన ముచ్చట. అనాడు మండల ఎన్నికల సందర్భంగా బాలయ్య టీడీపీ విజయం కోసం తన సినిమాలను సైతం కొన్నాళ్ళ పాటు పక్కన పెట్టి అలుపు లేకుండ ఉమ్మడి ఏపీ అంతా తిరిగిన రోజులు. ఇక ఎన్ టీఆర్ సమక్షంలోనే చాలా అద్భుతంగా నాడు బాలయ్య చేసిన ప్రసంగం చూసిన పెద్దాయన ముచ్చట పడి మనసులోది ఏదీ దాచుకోకుండా బాలయ్యే నా వారసుడు అనేశారు.

ఇక తెలుగుదేశం పార్టీలో 1995లో సంక్షోభం పుట్టింది. ఆగస్టు మూడవ వారంలో పుట్టిన ఆ సంక్షోభం కాస్తా నెలాఖరు నాటికి అన్న గారిని మాజీ సీఎం గా చేసింది. ఆ తరువాత ఎన్టీఆర్ చంద్రబాబుకు ఒక సవాల్ చేశారు. పార్టీ కోసమే తనను పదవీచ్యుతుడిని చేసాను అని చెబుతున్నపుడు హరిక్రిష్ణను సీఎం గా చేయవచ్చు కదా అని ఒక బహిరంగ సభ వేదికగా ప్రశ్నించారు

దీనిని బట్టి ఎన్టీఆర్ కి తన వారసులుగా బాలయ్య లేదా హరిక్రిష్ణ ఉండాలన్నది ఏకంగా బహిరంగానే ప్రకటించడం ద్వారా రుజువు అయింది. ఈ నేపధ్యంలో మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తూ వస్తున్న చంద్రబాబు తన వారసుడిగా లోకేష్ ని దాదాపుగా ప్రకటించేశారు.

ఈ కీలకమైన సందర్భంలో నందమూరి వారసులు ఎక్కడ అన్న చర్చ వస్తోంది. మహనాడు అంటే నందమూరి బాలకృష్ణ సందడి చేయడాన్ని అంతా చూసేవారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేల్గా ఉన్న్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. పైగా పార్టీకి ప్రచార కర్తగా నాలుగు దశాబ్దాల నుంచి ఉన్నారు. ఎన్టీఆర్ కి కుమారుడిగా బాబుకు వియ్యంకుడిగా లోకేష్ కి మామగా ఉన్న బాలయ్య ఇంతటి ప్రాధాన్యత కలిగిన మహానాడుకు హాజరు కాకపోవడం మీద చర్చ సాగుతోంది.

అంతే కాదు ఆయన హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళిని కూడా ఈసారి అర్పించలేదు. మరి బాలయ్య ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు అంటే ఆయన విదేశాలలో షూటింగ్ నిమిత్తం ఉన్నారని అంటున్నారు. ఆయన ఆ పనుల వల్లనే రాలేదు తప్ప మహానాడుకు దూరం కావడానికి ఎలాంటి వేరే కారణాలు లేవని అంటున్నారు. అయితే నందమూరి వారు ఎవరూ పెద్దగా కనిపించకపోవడం మీదనే చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే టీడీపీలో బాలయ్యకు కూడా కీలకమైన పదవి ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి బాలయ్య గైర్ హాజరు వెనక ఉన్న కారణాలు ఏమిటన్నవి.