జగన్ ఇలాకాలో మహానాడు... పెను సంచలనాలే !
తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు అంగరంగ వైభవంగా జరగనుంది.
By: Tupaki Desk | 5 May 2025 9:29 AM ISTతెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈసారి మహానాడు విశేషం ఏమిటి అంటే మొత్తం టీడీపీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని చోట మహానాడు జరపబోతున్నారు.
ఈ మహానాడుకు కడప జిల్లాను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కడప అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సొంత ఇలాకా. మరి ఇంతకాలం కడపలో ఎందుకు టీడీపీ తన మహానాడుని నిర్వహించలేదో తెలియదు కానీ ఈసారి మాత్రం గురిపెట్టి మరీ అదే తమ వేదిక అంటోంది.
అయితే ఆ మధ్యన జరిగిన ప్రచారం బట్టి చూస్తే కనుక మహానాడుని ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహిస్తారని కూడా అనుకున్నారు. తద్వారా వైసీపీకి పొలిటికల్ గా భారీ షాక్ ఇవ్వాలని కూడా తలచినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇపుడు చూస్తే మాత్రం మహానాడుని పులివెందులలో నిర్వహించడం లేదు. ఈ మేరకు కచ్చితమైన క్లారిటీ అయితే వచ్చేసింది. పులివెందుల కాకుండా కడపలోనే నిర్వహించబోతున్నారు. ఇక కడపలో కూడా సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలో భారీ ఎత్తున మహానాడు వేడుకను చేయబోతున్నారు. ఈ మేరకు అక్కడ విశాలమైన భూములను పరిశీలించి మహానాడు ప్రాంగణం కోసం పార్టీ నేతలు ఎంపిక చేశారు.
ఈ ప్రాంతంలోనే మహానాడు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఈ మహానాడుకు ఎంపిక చేసిన భూములు కలిగిన ప్రాంతం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరో వైపు చూస్తే ఈ నెల 7న మహానాడు పనులకు భూమి పూజ నిర్వహించి శరవేగంగా పూర్తి చేయాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు.
ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ ఏపీలో నాలుగో సారి అధికారంలోకి వచ్చింది. అది కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో వచ్చింది. అదే విధంగా టీడీపీ గెలిచిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు ఇదే కావడం విశేషం.
ఒక వైపు అమరావతి పునర్ నిర్మాణ పనులు ఊపందుకున్న నేపధ్యం ఉంది. మరో వైపు చూస్తే ఏపీలో అభివృద్ధి పనులకు వరసగా శ్రీకారం చుడుతున్న వైనం కనిపిస్తోంది. ఎటు చూసినా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా టీడీపీకి అంతా కలసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఈసారి గతానికి భిన్నంగా గొప్పగా మహనాడు నిర్వహించదలచారు అని తెలుస్తోంది.
ఈ మహానాడుకు పది లక్షల దాకా జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా మహానాడు వేడుక సాగుతుంది అని అంటున్నారు. ఇవన్నీ ఓకే కానీ పులివెందులలో మహానాడు ఎందుకు నిర్వహించడంలేదు అంటే అన్ని ప్రాంతాల నుంచి జనాలు వచ్చేందుకు సువిశాలమైన ప్రాంగణం అక్కడ దొరకలేదు అని అంటున్నారు. పైగా కడప జిల్లా నుంచి టీడీపీ సౌండ్ చేస్తే అది జిల్లా మొత్తమే కాదు ఏపీ అంతటా రీసౌండ్ చేయాలనే కడపను ఎంచుకున్నారు అని అంటున్నారు. మరి కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
