మహానాడుకు 'అన్నగారి' ఆహ్వానం.. ఏఐ సొబగు!
టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు ఈ సారి కడప వేదికగా సాగుతోంది. భారీఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమా నికి డిజిటల్ హంగులతో పాటు.. ఏఐ సొబగులు కూడా పొందుపరిచారు.
By: Tupaki Desk | 27 May 2025 9:05 AM ISTటీడీపీ నిర్వహిస్తున్న మహానాడు ఈ సారి కడప వేదికగా సాగుతోంది. భారీఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమా నికి డిజిటల్ హంగులతో పాటు.. ఏఐ సొబగులు కూడా పొందుపరిచారు. దీనిలో భాగంగా దివంగత ఎన్టీఆర్ వాయిస్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా అనుకరించి.. తెలుగు వారికి స్వాగతం పలికారు. అచ్చంగా అన్నగారి వాయిస్‌ను పోలిన ఈ ఆడియో విజువల్‌ను సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి విడుదల చేశారు. దీనిలో తెలుగువారిని నేరుగా అన్నగారు ఎన్టీఆర్ ఆహ్వానించారు.
''ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, నమస్కారం. తెలుగు జాతిని ఏకం చేయ డానికి తెలుగు వారిని జాగృతం చేయడానికి, నేను ప్రారంభించిన మహానాడు.. నేడు తెలుగు వారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకెంతో గర్వంగా ఉంది. 2025, మే 27, 28, 29 తేదీల్లో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడుకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జై మహానాడు. జై తెలుగు దేశం'' అని అన్నగారు స్వయంగా ఆహ్వానిస్తున్నట్టుగా దీనిని రూపొందించారు.
చంద్రబాబు సమీక్ష..
సోమవారం రాత్రికే చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఏర్పాట్లపై సమీక్షించారు. మహానాడు ఏర్పాట్లపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, మరో మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి ని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. వసతుల కల్పన విషయంలో ఎలాంటి లోటు రానీయొద్దని ఆదేశించారు. ఎంత మంది వచ్చినా.. నీరు, ఆహారం అందించేలా చూడాలని సూచించారు. ఇదిలావుంటే.. మహానాడు కోసం ప్రత్యేకంగా గీతాన్ని కూడా రూపొందించిన విషయం తెలిసిందే.
