మహానాడు వేడుక.. రెండు కళ్లు చాలవుగా!
దీనిలో సుమారు 20 కిపైగా షెడ్లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా మరో పెద్ద షెడ్డును కూడా ఏర్పాటు చేశారు. ఇదే అసలు మహానాడు వేదిక.
By: Tupaki Desk | 25 May 2025 1:01 PM ISTటీడీపీ నిర్వహించే పార్టీ పండుగ.. మహానాడు. ఈ నెల 27 నుంచి వరుసగా మూడు రోజుల పాటు నిర్వహిం చేందుకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి కడప జిల్లాలోని కమలాపురం, కడప అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్లో, హైవేను ఆనుకుని ఉన్న 120 ఎకరాల్లో ఈ మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేయింబవళ్లు నాయకులు, అధికారులు, కార్యకర్తలు శ్రమించి ఏర్పాట్లను కొలిక్కి తీసుకువచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ అధికారికంగా విడుదల చేసింది.
దీనిలో సుమారు 20 కిపైగా షెడ్లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా మరో పెద్ద షెడ్డును కూడా ఏర్పాటు చేశారు. ఇదే అసలు మహానాడు వేదిక. ఇక్కడే పార్టీ పరమైన అన్ని కార్యక్రమాలను చేపడతారు. సీఎం చంద్రబాబు కూడా పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా పక్కనే వంటల కోసం ప్రత్యేకంగా మరో భారీ షెడ్డును ఏర్పాటు చేశారు. ఇది సుమారు.. 500 గజాల పొడవుతో ఏర్పాటు చేయడం విశేషం.
అలానే.. వాహనాల పార్కింగుకోసం.. బహిరంగ ప్రాంతాన్ని చదును చేసి.. మార్కింగ్ వేశారు. వీఐపీ, వీవీఐపీ, నాయకుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయగా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి బస్సులు పార్కింగ్ చేసుకునేందుకు మరో ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్దేశించారు. ఇక, ఎక్కడికక్కడ విద్యుత్ సౌకర్యం కల్పించారు. అంతేకాదు.. ఎక్కడికక్కడ తాగునీటిని ఏర్పాటు చేశారు. ఎక్కడా తొక్కిసలాటలు చోటు చేసుకోకుండా.. విశాలంగా ప్రాంగణాలు నిర్మించారు. మొత్తంగా మహానాడు వేడుకల కోసం.. చేస్తున్న ఏర్పాట్లు చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్టుగా ఉన్నాయి.
