42 ఏళ్ల టీడీపీ.. మహానాడు జరగని సంవత్సరాలు తెలుసా?
2019-24 మధ్య అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న టీడీపీ.. గత ఏడాది ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చింది.
By: Tupaki Desk | 27 May 2025 5:00 PM ISTతెలుగు దేశం పార్టీ (టీడీపీ) పెద్ద పండుగ మహానాడు. వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జన్మదినం కలిసొచ్చేలా.. మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమమే మహానాడు. టీడీపీ ప్రజల కోసం ఎన్ని మహాసభలు నిర్వహించినా.. పార్టీ కోసం నిర్వహించే మహానాడు మాత్రం నభూతో అన్నట్లుగా సాగుతుంది. 1982 మార్చి 29న తెలుగువారి అభిమాన నటుడు, అన్నగారు నందమూరి తారక రామారావు మానస పుత్రికగా పుట్టిన టీడీపీ.. 43 ఏళ్లు పూర్తిచేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ఏటా ’మహానాడు’ను మాత్రం మరువదు.
2019-24 మధ్య అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న టీడీపీ.. గత ఏడాది ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చింది. తాజాగా కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా సాగుతోంది. 43 ఏళ్లు పూర్తిచేసుకున్న టీడీపీకి ఇది 39వ మహానాడు. ఇన్ని సంవత్సరాలలో ఆ పార్టీ పండుగ మహానాడును జరుపుకోనిది నాలుగేళ్లు.
1985, 1991, 1996, 2012లో టీడీపీ మహానాడు జరగలేదు. వీటిలో 1985, 1996లో తెలుగుదేశం పార్టీనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. 1991, 2012లో మాత్రం టీడీపీ ప్రతిపక్షంలో ఉంది.
1985 నాటికి టీడీపీ పుట్టి మూడేళ్లవుతున్నా.. మహానాడును బహుశా రాజకీయ సంక్షోభం కారణంగా నిర్వహించలేదనుకుంటా. ఎన్టీఆర్ జీవించి ఉన్నా 1991లో మహానాడు జరగలేదు. ఇక ఆయన మరణంతో 1996లో మహానాడును నిర్వహించడం సమంజసం కాదని భావించినట్లున్నారు.
ఉమ్మడి ఏపీలో చివరగా.. 2012లోనూ మహానాడును ఏర్పాటు చేయలేదు. ఆ ఏడాది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల రాజీనామా కారణంగా ఉప ఎన్నికలు రావడంతో మహానాడుకు అవకాశం దక్కలేదు.
2022లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మహానాడు ఎన్టీఆర్ సొంత ప్రాంతమైన విజయవాడలో నిర్వహించింది. ఆ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం కావడం గమనార్హం.
