టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్
తెలుగుదేశం పార్టీ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. మహానాడు సందర్భంగా పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
By: Tupaki Desk | 27 May 2025 3:28 PM ISTతెలుగుదేశం పార్టీ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. మహానాడు సందర్భంగా పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగిన తర్వాత మిగిలిన కార్యకర్గం ఏర్పాటు అవుతుంది. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అధ్యక్ష పదవి ఏకగ్రీవమవుతూనే ఉంది. 1982 మార్చి 29న టీడీపీ ఆవిర్భవించింది. అప్పుడు అధ్యక్షుడిగా దివంగత నేత, అన్న ఎన్టీఆర్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1995 వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత చంద్రబాబు అధ్యక్ష పదవి చేపట్టి దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు.
2014లో టీడీపీ జాతీయ పార్టీగా మారిన తర్వాత చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రెండేళ్లకు ఒకసారి టీడీపీ కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మహానాడులో పార్టీ బైలానామా ప్రకారం ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. అదే సంప్రదాయం ఇప్పుడు కొనసాగిస్తున్నారు. మహానాడు తొలిరోజు సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు (బుధవారం) నామినేషన్లను పరిశీలిస్తారు. వెంటనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ఎన్నిక నిర్వహిస్తారు.
ఇప్పటివరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక ఈ ఏడాది నుంచి పార్టీలో కొత్తగా వర్కింగు ప్రెసిడెంట్ పదవిని సృష్టిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంతవరకు పార్టీ ఎటువంటి నిర్ణయం వెలువరించలేదు. ఇదే సమయంలో పార్టీ నాయకత్వాన్ని చంద్రబాబు తనయుడు లోకేశ్ కు అప్పగించాలని డిమాండ్ వినిపిస్తోంది. దీంతో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి లోకేశ్ ను ప్రమోట్ చేస్తారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే చంద్రబాబు యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదిఏమైనా ఈ రోజు సాయంత్రం నాటికే ఎవరు అధ్యక్షుడు అవుతారనేది స్పష్టత వస్తుందని అంటున్నారు.
