Begin typing your search above and press return to search.

టీడీపీ సీనియర్ల మనసు లాగేస్తోందా ?

నిజానికి రాజకీయాల్లో ఎవరైనా చివరి ఊపిరి దాకా కొనసాగుతారు రాజకీయాలకు వయసుతో సంబంధం లేదని చెబుతారు.

By:  Tupaki Desk   |   20 Jan 2026 12:00 PM IST
టీడీపీ సీనియర్ల మనసు లాగేస్తోందా ?
X

తెలుగుదేశం పార్టీ వయసు దాదాపుగా 45 ఏళ్ళు, ఈ మార్చికి 44 ఏళ్ళు నిండి 45వ పడిలోకి పార్టీ అడుగు పెడుతుంది. ఇక ఆ పార్టీ పెట్టినపుడు కొత్తగా చేరిన యువ నేతల వయసు పాతికేళ్ళుగా ఉంటే ఇపుడు వారంతా ఏడు పదులకు చేరువలో ఉన్నారు. టీడీపీ తొలి టికెట్ ని అన్న ఎన్టీఆర్ నుంచి అంది పుచ్చుకుని గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన యంగెస్ట్ బ్యాచ్ ఈ రోజు టీడీపీలో మోస్ట్ సీనియర్ బ్యాచ్ గా మారారు. ఇక వారిలో ఇపుడు కొత్త ఆలోచనలు కలుగుతున్నాయట. వారంతా ఒక్కటే మాట్లాడుతున్నారు.

రిటైర్ అవుతామంటూ :

టీడీపీలో సీనియర్ నేతలు అంతా ఒక్కటే పోరు పెడుతున్నారు. తాము రిటైర్ అయిపోతామని అంటున్నారు. ఒకరిద్దరు కాదు ఏపీ వ్యాప్తంగా అదే మాటగా ఉంది. టీడీపీలో సీనియర్ల పదవీ విరమణ జాబితా కనుక చూస్తే కొండవీటి చాంతాడు మాదిరిగా ఉంది. వీరంతా రిటైర్ అయితే మాత్రం భారత దేశ రాజకీయాల్లోనూ అందులోనూ ఒక ప్రాంతీయ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున పక్కకు తప్పుకున్న నాయకులు ఉండరేమో అన్న చర్చ కూడా సాగుతోంది.

అన్నీ గమంచిన మీదటనే :

నిజానికి రాజకీయాల్లో ఎవరైనా చివరి ఊపిరి దాకా కొనసాగుతారు రాజకీయాలకు వయసుతో సంబంధం లేదని చెబుతారు. కానీ టీడీపీ సీనియర్లు మాత్రం వయసు అయిపోయిందని అంటూ పక్కకు తప్పుకోవాలని చూస్తున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముందుగా ఒక కారణం తీసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా యంగర్ జనరేషన్ కే టికెట్లు ఇస్తారు అని ప్రచారంలో ఉంది. నారా లోకేష్ మరింత పటిష్టమైన నాయకత్వం స్థాయిలోకి వస్తారని ఆయన టీం అన్నది తయారు అవుతుందని అంటున్నారు.

వ్యూహాత్మకంగా ఆలోచనలతో :

దాంతో తాముగా తప్పుకుంటే బెటర్ అన్నదే సీనియర్ల ఆలోచనగా చెబుతున్నారు. అదే సమయంలో తాము చంద్రబాబు వద్ద ఎలా ఒక కీలక బృందంగా ఉన్నామో అలాగే నారా లోకేష్ వద్ద తమ వారసులను కూడా చేరిస్తే మరో నాలుగు దశాబ్దాలకు సరిపడ రాజకీయం తమ ఇంటికే అంది వస్తుందని వ్యూహాత్మకమైన ఆలోచనలతో కూడా ఈ పదవీ విరమణ పాట పాడుతున్నారని అంటున్నారు. ఇక ఇల్లు ఉండగానే చక్కబెట్టుకోమని ఒక సామెత ఉంది. రాజకీయాల్లో ఉన్న వారికి ఇది పదే పదే గుర్తుకు వచ్చే అచ్చమైన సామెత. అందుకే అంతా రిటైర్మెంట్ అంటున్నారు.

వీరంతా రెడీనట :

తాజాగా నర్శీపట్నంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనకు డెబ్బయ్యేళ్ళు వచ్చాయని తాను రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని వేదిక మీద నుంచే చెప్పేశారు. ఇక చాలు తన రాజకీయం అని కూడా వైరాగ్య ధోరణిలో అనేశారు. అయ్యన్న కుమారుడు విజయ్ పాత్రుడికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకోవాలని ఆయన చూస్తున్నారు అని ప్రచారంలో ఉంది. అలాగే భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్దరావు సైతం వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదుల వయసుకు చేరువ అవుతారు, ఆయన సైతం కుమారుడి కోసమే చూస్తున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, కిమిడి కళా వెంకటరావు, దాడి వీరభద్రరావు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు ఉన్నారు

మూకుమ్మడిగా పదవీ విరమణ :

రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతీ జిల్లాలో ఈ తరహా నేతలు అనేక మంది టీడీపీలో ఉన్నారు. ఒక అంచనాగా వేసుకున్న లెక్క చూస్తే కనుక కనీసంగా ముప్పయి నుంచి నలభై మంది దాకా సీనియర్ నేతలు 2029లో మూకుమ్మడిగా పదవీ విరమణ చేస్తారు అని ప్రచారం సాగుతోంది. అంతే సంఖ్యలో వారసులు కూడా ఎంట్రీ ఇస్తారని కూడా వినిపిస్తోంది. మరి టీడీపీ హైకమాండ్ వీటిని ఏ విధంగా చూస్తుంది ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నదే అసలైన చర్చగా ఉంది.