ఈ తమ్ముళ్లు.. మహాముదుర్లు!
ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేత పార్టీని పరుగులు పెట్టించడంతోపాటు.. అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
By: Garuda Media | 6 Oct 2025 9:00 PM ISTఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేత పార్టీని పరుగులు పెట్టించడంతోపాటు.. అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. విజన్ - 2047 లక్ష్యంతో సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. కానీ, ఇదేసమయంలో జిల్లాకో తమ్ముడు ఆయన ప్రభుత్వాన్ని.. పార్టీని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పటికప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఎంత కట్టడి చేసినా.. ఎవరూ మారకపోవడం.. చంద్రబాబు హెచ్చరికలు కూడా బుట్టదాఖలు కావడం గమనార్హం.
చిత్తూరు: ప్రస్తుతం తెరమీదికి వచ్చిన నకిలీ మద్యం వ్యవహారంలో సీనియర్ నేత, గత ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన.. జయచంద్రారెడ్డి ఉన్నారు. ఈయన నోరు విప్పితే.. మరింత మంది వ్యవహారం బయటకు వస్తుందని అంటున్నారు. వారంతా కూడా టీడీపీ నాయకులేనని సమాచారం.
అనంతపురం: జేసీ ప్రభాకర్‌రెడ్డి దూకుడు కారణంగా.. అనంతపురంలో పార్టీ పరిస్థితి దారుణంగా తయా రైంది. కుండెడు పాలలో ఒక్క ఉప్పు గల్లు మాదిరిగా.. జిల్లా మొత్తాన్నీ ఆయన ప్రభావితం చేస్తున్నారు. ఏదో ఒక వివాదం తో చెలరేగుతున్నారు. ఇక, వైసీపీ నాయకులపై చేస్తున్న రగడ అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా మారలేదు.
సత్యవేడు: ఎమ్మెల్యే ఆదిమూలం సంగతి అందరికీ తెలిసిందే. టీడీపీ కి చెందిన మహిళా నాయకురాలి తో ఆయన సరసాలాడిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. దీనిని రాజీ చేసినా.. ఆయన వ్యవహారంతో పార్టీ భారీగా దెబ్బతింది. ఇక్కడ శంకర్‌రెడ్డిని ఇంచార్జ్‌గా నియమించారు. కానీ, ఆయన దూకుడు మరో రూపంలో ఉండడంతో పార్టీకి నష్టం కలుగుతోంది.
నూజివీడు: సొంత పార్టీ నాయకులే.. గ్రావెల్, ఇసుక అక్రమాల్లో ఆరితేరిపోయారన్నది చంద్రబాబే చెబుతున్న మాట. వారు కంట్రోల్‌లోకి రావడం లేదు.
శ్రీకాళహస్తి: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అధికారులపై దూషణలతో ఆయన కూడా ఏమీ తక్కువ తినలేదన్న వాదన వినిపిస్తోంది. బాబు హెచ్చరికలను ఈయన బుట్ట దాఖలు చేయడం గమనార్హం.
విశాఖ: ఇక్కడ కూడా.. నాయకుల దూకుడు ఎక్కువగానే ఉంది. అవినీతిలో ఫస్ట్ ప్లేజ్ ఈ జిల్లాదేనని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అంతేకాదు.. ప్రతి నెలా .. ఎవరో ఒక అధికారి సస్పెండ్ అవుతూనే ఉన్నారు. వీరివెనుక కీలక నేతల ప్రమేయం ఉందని చంద్రబాబుకు కూడా తెలుసు.
