ఏడాది వరకు నో పొలిటికల్ పోస్టింగ్స్.. 2027లోనే కొత్త పదవులు!
కూటమి ప్రభుత్వంలో పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు మరో ఏడాది పాటు నిరీక్షించాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 17 July 2025 5:00 AM ISTకూటమి ప్రభుత్వంలో పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు మరో ఏడాది పాటు నిరీక్షించాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. దాదాపు వంద వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది మరే పదవులనూ భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. సుమారుగా అన్ని ముఖ్యమైన కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినందున ఇకపై ఖాళీల మేరకే రాజకీయ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది ఆరంభంలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నందున ఈ ఆరు నెలలు నేతల పనితీరు ఆధారంగానే పదవుల భర్తీ చేస్తామని చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహుల ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.
ప్రస్తుతం కూటమిలో అనేక మంది నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా టీడీపీలో నామినేటెడ్ పోస్టులతోపాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ పదవులకు చాలా డిమాండ్ ఏర్పడింది. గత ఎన్నికల సమయంలో 31 మంది నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు టికెట్లను త్యాగం చేశారు. ఈ 31 నియోజకవర్గాల్లో 29 మంది గెలవడంతో స్థానికంగా కూడా వారు ప్రోటోకాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మిత్రపక్షాల నేతలు ఎమ్మెల్యేలుగా ఉండటం, తమకు ఏ పదవీ లేకపోవడంతో రాజకీయంగా ప్రాధాన్యం కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీలుగా అవకాశం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.
అయితే ఎన్నికల అనంతరం ఖాళీ అయిన రాజ్యసభ, శాసనమండలి స్థానాలను ఒకరిద్దరు కొత్తవారికి మాత్రమే కేటాయించి, మిగిలిన పదవులను రాజీనామా చేసి పార్టీ మారిన వారికే కేటాయించారు. ఇక 2027 మార్చి వరకు శాసనమండలి, అదే ఏడాది జులై వరకు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితులు లేకపోవడంతో పదవుల భర్తీ కోసం అప్పటివరకు వేచి ఉండాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబరులో వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఒక్కరే రిటైర్ కానున్నారు. ఇక ఆ తర్వాత మార్చిలో కొందరు, జూన్ లో మరికొందరు ఎమ్మెల్సీలు పదవులను వీడనున్నారు. ఇలా 2027లో మొత్తం 24 మంది ఎమ్మెల్సీలు పదవులను కోల్పోనుండగా, ఆ పదవులు అన్నీ కూటమి పార్టీల నేతలకు దక్కే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఆ పదవులు దక్కించుకోవాలంటే మరో ఏడాది పాటు నిరీక్షించాల్సిరావడమే నేతలకు పరీక్షగా మారుతోంది. ఇప్పటికే పదవులు లేక క్షణమొక యుగంలా గడుపుతున్న నేతలు, రానున్న కాలాన్ని ఎలా నెట్టుకురావాలా? అని బెంగపెట్టుకొంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తోపాటు, పదవులు లేకుండా రాజకీయ ప్రత్యర్థులను తట్టుకుని నిలవడం కష్టమని ఆందోళన చెందుతున్నారు. 2027 ఎప్పుడు వస్తుందా? అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
