'తమ్ముళ్ల'కు `పందెం` కొట్టేసింది.. !
సంక్రాంతి మూడు రోజుల పండుగ సందర్భంగా ఉభయ గోదావరి,ఉమ్మడి కృష్నా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందేల బరులు నిర్వహించారు.
By: Garuda Media | 21 Jan 2026 11:00 AM ISTసంక్రాంతి మూడు రోజుల పండుగ సందర్భంగా ఉభయ గోదావరి,ఉమ్మడి కృష్నా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందేల బరులు నిర్వహించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు.. పందేల్లో పాల్గొన్నా రు. వంద మందిలో 90 మంది సొమ్ములు కోల్పోగా.. పది మంది పందేలు గెలుచుకున్నారు. అయితే.. పందెం అన్నాక కామనే కదా? ఓటమి-గెలుపులకు సిద్ధపడే ఎవరైనా పందేలు కాస్తారు.
వస్తుందన్న ఆశతో ఉన్నది పోగొట్టుకోవడమే పందెం. ఈ విషయంలో ఎవరూ తేడా లేరు. సరే.. ఇదిలావుం టే.. ఈ పందేల బరుల విషయంలో అతిగా ఆశలు పెట్టుకుని పెట్టుబడులు పెట్టిన టీడీపీ నాయకులకు చాలా మందికి భారీ షాక్ తగిలింది. కొందరు తమ స్నేహితులను కూడా కలుపుకొని పందేల బరులు నిర్వహించారు. మూడు రోజుల్లో భారీ ఎత్తున లాభాలు ఉంటాయని కొందరు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో బరులకు 30-50 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారు. ఇక, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ 20-25 కోట్ల రూపాయల వరకు పెట్టారు. ఇవన్నీ.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగాయి. పెట్టిన పెట్టుబడులకు రెండింతలు లాభాలు వస్తాయని వీరు అంచనా వేసుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ దఫా నష్టాలు చవి చూసిన వారు.. పదుల సంఖ్యలో ఉన్నారని టీడీపీలో చర్చ సాగుతోంది.
తాజాగా.. కొందరు నాయకులు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇదే విషయంపై చర్చించుకున్నారు. కాంట్రాక్టులు తీసుకునేందుకు సిద్ధం చేసుకున్న సొమ్మును పెట్టుబడిగా పెట్టిన వారు చాలా మంది ఉన్నా రని తెలిసింది. బరులను ముందుగానే వేలం వేశారు. అయితే.. బినామీలుగా వారి అనుచరులకే అవి దక్కేలా చేసుకున్నారు.
కానీ, ఆటలు సరిగా సాగకపోవడం.. పందేలు కూడా.. వేరే వ్యక్తులు సొంతం చేసుకోవడంతో ఇప్పుడుతమ్ముళ్లకు ఆర్థికంగా నష్టం.. కష్టం వచ్చింది. కానీ, పైకి చెప్పుకోలేక.. లోలోన బాధపడలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు.. దీనిని పూడ్చుకునేందుకు వేరే మార్గాలను ఎంచుకుంటున్నారట.
