Begin typing your search above and press return to search.

బోండా ఉమా తర్వాత మంత్రి సుభాష్.. చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోని టీడీపీ నేతలు?

ఇటీవ‌ల విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు.. వైసీపీ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుతో క‌లిసి వేదిక‌ను పంచుకున్నారు. చెట్టాప‌ట్టాలేసుకుని ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని క‌బుర్లు చెప్పారు. ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది.

By:  Garuda Media   |   10 Aug 2026 7:36 PM IST
బోండా ఉమా తర్వాత మంత్రి సుభాష్.. చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోని టీడీపీ నేతలు?
X

టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెబుతున్న మాట‌ల‌ను ఆ పార్టీ నాయ‌కులు లైట్ తీసుకుంటున్నారా? వైసీపీ నాయ‌కుల‌తోను, ఆ పార్టీ మాజీ మంత్రుల‌తోనూ వేదిక‌లు పంచుకోవ‌ద్ద‌ని ఇచ్చిన ఆదేశాల‌ను పెడ‌చెవిన పెడుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇటీవ‌ల విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు.. వైసీపీ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుతో క‌లిసి వేదిక‌ను పంచుకున్నారు. చెట్టాప‌ట్టాలేసుకుని ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని క‌బుర్లు చెప్పారు. ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది.

దీనిపై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. ఎమ్మెల్యేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయన నుంచి వివ‌ర‌ణ తీసుకున్నారు. దీనికి సంబంధించి నాలుగు రోజుల పాటు రాజ‌కీయాలు వేడివేడిగా సాగాయి. ''గొడ్డ‌లి పార్టీ నేత‌ల‌తో వేదిక‌లు పంచుకోవ‌ద్దు. అది ఎవ‌రైనా స‌రే.. ఉపేక్షించేది లేదు.'' అని ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు గ‌ట్టిగానే చెప్పారు. పార్టీ నాయ‌కుల‌కు మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చారు. బోండా ఉమా నుంచి వివ‌ర‌ణ తీసుకోవ‌డ‌మే కాదు.. నేరుగా ఆయ‌న‌ను హెచ్చ‌రించారు కూడా. అయితే.. ఈ ప‌రిణామం చూసిన త‌ర్వాత కూడా.. నాయ‌కుల్లో మార్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా కార్మిక శాఖ మంత్రి సుభాష్‌.. నేరుగా వైసీపీ నాయ‌కుల‌తో వేదిక‌ను పంచుకున్నారు. వైసీపీ స్థానిక నాయ‌కు ల‌తో క‌లిసి ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. క‌బుర్లు చెప్పారు. వారితో స‌ర‌దాగా న‌వ్వుకుంటూ.. వ్య‌వ‌హ‌రించారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు టీడీపీలో తీవ్ర‌స్థాయి చ‌ర్చ‌కు దారి తీసింది. ''క్షేత్ర‌స్థాయిలో మంత్రులే ఇలా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అంటూ.. చంద్ర‌బాబు మ‌రోసారి మంత్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నార‌ని తెలిసింది. వారి నుంచి త‌క్ష‌ణ‌మే వివ‌ర‌ణ కోరండి'' అని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావును ఆదేశించారు.

ఏం జ‌రిగింది?

శెట్టి బ‌లిజ క‌మ్యూనిటీకి చెందిన మంత్రి సుభాష్‌.. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహా విష్కరణ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తోపాటు కాకినాడ రూర‌ల్ సెగ్మెంట్ టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత‌ల‌క్ష్మి స‌హా.. మ‌రికొంద‌రు టీడీపీ నాయ‌కులు వ‌చ్చారు. వీరంతా వైసీపీ నేత‌ల‌తో క‌లిసి పాల్గొన్నారు. ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. కార్య‌క్ర‌మం ఆసాంతం వైసీపీ నాయ‌కుల‌తో ముచ్చ‌టించారు. ఈవ్య‌వ‌హారం రాజ‌కీయం గా దుమారం రేపింది. చంద్ర‌బాబు చెప్పిన మాట ప్ర‌కారం.. వైసీపీ నేత‌ల‌తో వేదిక‌లు పంచుకోకడ‌ద‌ని తెలిసినా.. వీరు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై అధినేత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తంగా చంద్ర‌బాబు చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు పెడ‌చెవిన పెట్ట‌డంతో ఆయ‌న వివ‌ర‌ణ కోరారు.