లోకేష్..బాబు...పవన్...వరుసగా ఢిల్లీ టూర్లు !
ఏపీలో టీడీపీ కూటమికి సారథ్యం వహిస్తున్న ముగ్గురు బిగ్ షాట్స్ వారం తేడాలో వరసబెట్టి ఢిల్లీ టూర్లు చేయడం ఇటీవల కాలంలో రాజకీయంగా సంచలనం అనే అంటున్నారు.
By: Tupaki Desk | 26 May 2025 1:20 AM ISTఏపీలో టీడీపీ కూటమికి సారథ్యం వహిస్తున్న ముగ్గురు బిగ్ షాట్స్ వారం తేడాలో వరసబెట్టి ఢిల్లీ టూర్లు చేయడం ఇటీవల కాలంలో రాజకీయంగా సంచలనం అనే అంటున్నారు. నిజానికి పొలిటికల్ గా ఇలాంటి టూర్లే వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూంటాయి. ఏపీ కూటమి పెద్దల హస్తిన పర్యటనలు ఎందుకు ఏమిటి అంటే వారు వెళ్ళడానికి కారణాలు అధికారికంగా ఉన్నాయి. కానీ అంతర్లీనంగా మరో టార్గెట్ ఉందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.
ఇక విషయానికి వస్తే నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీని ఈ నెల 17న కుటుంబ సమేతంగా కలసి వచ్చారు. మోడీతో కలసి ఆయన చాలా సేపు గడిపారు. డిన్నర్ కూడా చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ భేటీలో అన్ని విషయాలు చర్చించారు అని కూడా ప్రచారం సాగింది. ఏపీ రాజకీయ పరిస్థితుల మీద కూడా చర్చించుకున్నారని పేర్కొంటూ ఢిల్లీ వర్గాలు కబుర్లు చెప్పాయి.
కట్ చేస్తే ఈ నెల 22 నుంచి 24 దాకా మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ తో ఢిల్లీ టూర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోం మంత్రితో 23న ఏకంగా గంట పాటు సుదీర్ఘమైన భేటీ వేశారు. ఈ భేటీలో కూడా ఏపీ రాజకీయాల గురించి చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. ఆ తరువాత 24న జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ప్రధానితో చంద్రబాబు కలసి ముచ్చట్లు పెట్టిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి.
బాబు టూర్ ఇలా ముగిసిందో లేదో ఎండీయే ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమత్రులతో మోడీ ఢిల్లీలోని అశోకా హోటల్ లో నిర్వహించిన కీలక భేటీకి ఏపీ నుంచి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయన ప్రధాని మోడీతో కలసి కనిపించారు.
ఇలా టాప్ త్రీ అంతా గత వారం రోజుల వ్యవధిలో ఢిల్లీకి వెళ్ళింది. ఇంతకీ ఢిల్లీలో అంత ఇంపార్టెంట్ విషయాలు ఏమిటి అంటే ఈ ముగ్గురు నాయకులు అధికారికంగానే వెళ్ళారు. వారు భేటీలు అయిన సందర్భాలు కూడా కీలకమైనవే. అయితే ఏపీలో రాజకీయాల నుంచి కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చిందని అంటున్నారు.
ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ కి సంబంధించి ఏపీలో రచ్చ సాగుతున్న వేళ విపరీతమైన ప్రచారాలు వార్తా కధనాలు ఆ విషయంలోనే సాగుతున్న వేళ ఈ ముగ్గురూ టాప్ లీడర్స్ ఢిల్లీకి వెళ్ళడంతో అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపో మాపో జగన్ అరెస్ట్ అని సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న వేళ ఈ ఢిల్లీ టూర్లు సాగడంతో ఈ అంతా ఆసక్తిని చూపిస్తున్నారు.
ఇంతకీ జగన్ అరెస్ట్ ఏమైంది అంది ఉంటుందా లేదా ఉంటే ఎపుడు అన్న చర్చ అలాగే కొనసాగుతోంది. మహానాడు ఒక రోజు తేడాతో మొదలు కాబోతోంది. మూడు రోజుల పాటు సాగనుంది. మహానాడు ముందు అరెస్ట్ అన్నారు. ఇపుడు అయితే అలాంటి వాతావరణం ఉండకపోవచ్చు అని అంటున్నారు. మరి మహనాడు తరువాత అరెస్ట్ ఏమైనా ఉంటుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు.
తాను విజయవాడలోనే ఉన్నాను అని జగన్ అరెస్ట్ మీద చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. దాంతో జగన్ అరెస్ట్ విషయంలో సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ఇచ్చారా అని ఇంకో చర్చ ఉంది. ఏది ఏమైనా జగన్ అరెస్ట్ అన్నది చిన్న విషయం అయితే కాదని జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్ధం అవుతోంది అని అంటున్నారు.
ఏపీలో రాజకీయంగా చూస్తే కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన మరి కొద్ది రోజులలో పూర్తి కాబోతోంది. అలాగే కూటమి ఇపుడు కొంత స్టేబుల్ గా ఉంది. ఈ నేపధ్యంలో జగన్ అరెస్ట్ అని రాజకీయంగా ప్రకంపనలు ఉంటాయా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే రాజకీయాల్లో దేనికైనా ఒక టైం ఉంటుంది అని అంటున్నారు. అలా అనుకుంటే కనుక జగన్ అరెస్ట్ కి ముహూర్తం కుదిరిందా లేదా అంటే వెయిట్ అండ్ సీ అనే చెప్పాల్సి ఉంటుంది. అంతవరకూ అంతా చర్చలతోనే గడాపాల్సి ఉంటుంది. ఈలోగా ఎవరు ఢిల్లీ వెళ్ళినా ఆలోచనలు లెక్కలూ అన్నీ ఆ వైపునకే మళ్ళించుకోవడమూ ఉంటుంది.
