విచారణలు - వివరణలు.. టీడీపీలో మరో నేతకు 'ఆహ్వానం'.. !
టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో చేస్తున్న రాజకీయాలు.. పార్టీకి ఇమేజ్ పెంచకపోగా.. డైల్యూట్ చేసేలా ఉంటున్నాయన్న చర్చ పార్టీలో సాగుతోంది.
By: Garuda Media | 29 July 2026 6:58 PM ISTటీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో చేస్తున్న రాజకీయాలు.. పార్టీకి ఇమేజ్ పెంచకపోగా.. డైల్యూట్ చేసేలా ఉంటున్నాయన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఇటీవలి పరిణామాలను లెక్కిస్తే.. కాపు నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభకు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు హాజరు కావడం పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన కాపు సమావేశానికి హాజరు కావడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ, ఆ సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు పక్కన కూర్చుని చర్చించడమే వివాదానికి దారి తీసింది.
దీనిపై బొండా ఉమా నుంచి వివరణ తీసుకున్నారు. విచారణ చేశారు. మొత్తానికి ఈ విషయం ఏదో ఒక రకంగా సర్దుమణిగింది. అయితే.. ఇక్కడ కాపు కులస్థులు ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నారన్న వాదన మరోవైపు వినిపిస్తోంది. కాపు సమావేశానికి వెళ్తే.. కూడా తప్పా అన్న ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. ఇదిలావుంటే.. తాజాగా మరో నేతకు విచారణ కోసం రావాలంటూ.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. ఆమె.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. ఇక, ఆమె తీరును పార్టీ తెలుసుకోనుంది.
భూమా అఖిల ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది? ఆమె ఆది నుంచి కూడా ఫైర్ బ్రాండ్ నాయకురాలు. నియోజకవర్గంలోనే కాదు.. జిల్లా అంతా.. తన మాటే చెల్లుబాటు కావాలని కోరుకునే కొంత మంది నాయకుల జాబితాలో అఖిల ప్రియ కూడా ఉంటారు.ఈ విషయంలో సొంత పార్టీ నేతలైనా ఆమ దూకుడుగా నే వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఆమె సింపతీని కోల్పుతున్నారన్న విషయం తెలిసినా.. లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే అహోబిలం పుణ్యక్షేత్రం విషయంలో వివాదానికి దిగారు.
అహోబిలం పుణ్యక్షేత్రంలో భక్తులకు కల్పించే సౌకర్యాలు, ఇతర విషయాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో తన పంతం నెగ్గించుకునేందుకు అఖిల ప్రియ ప్రయత్నించారు. ఇది పెను వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే సొంత పార్టీ నాయకుడే అయినా.. ఆయనతోనూ ఆమె సై అంటే సై అన్నట్టుగా రాజకీయాలు చేశారు. సవాళ్లు రువ్వారు. మరోవైపు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేతోనూ ఆమె సవాళ్ల రాజకీయాలకు తెరదీశారు. దీంతో పార్టీకి తీవ్ర నష్టం వచ్చిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో చంద్రబాబు సీరియస్ కావడంతో పాటు ఆమెను విచారించి నివేదిక ఇవ్వాలని పార్టీనాయకులను ఆదేశించారు.
