Begin typing your search above and press return to search.

లోకేశ్ లో ఇంత మార్పా..? మహానాడు స్పీచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీడీపీ యువనేత, ఆ పార్టీ భావినేత, ఏపీ మానవ వనరుల మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ గా మారిపోయారు.

By:  Tupaki Desk   |   30 May 2025 3:22 PM IST
లోకేశ్ లో ఇంత మార్పా..? మహానాడు స్పీచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

టీడీపీ యువనేత, ఆ పార్టీ భావినేత, ఏపీ మానవ వనరుల మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ గా మారిపోయారు. కడపలో మూడు రోజుల పాటు టీడీపీ నిర్వహించిన మహానాడులో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచిన లోకేశ్ చివరి రోజు అద్భుతమైన ప్రసంగంతో కార్యకర్తల హృదయాలను కొల్లగొట్టారని అంటున్నారు. మహానాడు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగంలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఆయన ప్రసంగం విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు తన సొంత నియోజకవర్గం మంగళగిరి అని పలకడానికే తడబడిన లోకేశ్ మహానాడులో అనర్గళంగా మాట్లాడటం చూసిన వారంతా దెబ్బ తిన్న పులిని చూసినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో మంత్రి లోకేశ్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఏ హోదాతో ఆయన ఇతర మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో కూటమిలో జనసేన, బీజీపీతో టీడీపీకి విభేదాలు తీసుకువచ్చేలా కూడా విపక్షం ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం ఉంది. అయితే విపక్షం ఎంత రెచ్చగొట్టినా మంత్రి లోకేశ్ మాత్రం పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. కానీ, మహానాడు వేదికగా విపక్షం దుమ్ము దులిపేలా లోకేశ్ మాస్ స్పీచ్ ఇచ్చారు. సుమారు 30 నిమిషాల పాటు ప్రసంగించిన లోకేశ్ ఊరమాస్ డైలాగులతో కార్యకర్తలను ఉర్రూతలూగించారని ప్రశంసలు అందుకున్నారు.

ఒకప్పుడు మాటల్లో తడబాటుకు గురైన లోకేశ్ లో ఇప్పుడు ఎక్కడా ఆ ఛాయలు కనిపించడం లేదు సరికదా తెలుగులో మరింత స్పష్టంగా మాట్లాడటం సభికులను ఉత్తేజ పరిచింది. లోకేశ్ మాటలను టీవీల్లో చూస్తున్న వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారని అంటున్నారు. తన ప్రసంగంలో రాసుకొచ్చినట్లు కాకుండా.. తన అనుభవాల సమాహారంగా గత ఐదేళ్లు అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న నష్టాలను వివరించమే కాకుండా భవిష్యత్తులో తానంటే ఏంటో చూపిస్తానని సవాల్ విసరడం మాస్ అట్రాక్షన్ గా నిలిచిందని అంటున్నారు.

ప్రసంగం ప్రారంభంలోనే రెడ్ బుక్ కోసం మాట్లాడిన లోకేశ్ కొడాలి నాని, సజ్జల రామక్రిష్ణారెడ్డి, వంశీ, పోసాని క్రిష్ణమురళి వంటి వారి పేర్లు ప్రస్తావించకుండానే వారికి ఏం జరిగిందో ప్రస్తావించారు. అదేవిధంగా ప్రతిపక్షం విమర్శిస్తున్న రెడ్ బుక్ పై వెనక్కి తగ్గేది లేదని చెప్పడం ద్వారా తాను బెదిరింపులకు లొంగననే సంకేతాలు పంపారని అంటున్నారు. తన పాదయాత్రలో ఎదురైన అనుభవాలు, తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు నాటి పరిస్థితులను మరోసారి గుర్తు చేసిన లోకేశ్.. వాటికి రివేంజ్ ఉంటుందని చెప్పకనే చెప్పారంటున్నారు.

అదేవిధంగా కుంభకోణాలు, అవినీతికి పాల్పడేవారిని వదలమని వార్నింగ్ ఇవ్వడంతోపాటు కడప గడ్డపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి తల్లి, చెల్లిని వదిలేయడంపై విమర్శలు గుప్పించారు. అదేసమయంలో పవన్, బీజేపీతో పొత్తు కంటిన్యూ అవుతుందని ఎవరు ఎన్ని చెప్పినా తమ బంధం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు తమ పాలనను కొనసాగించమని మహానాడు వేదికపై ప్రజలను అభ్యర్థించారు. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారితే అభివృద్ధి నిలిచిపోతుందని, గుజరాత్ లో ఏడు దఫాలుగా ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల ఎలాంటి ప్రగతి జరిగిందో వివరించారు. పక్కనే ఉన్న ఒడిశాలోనూ ఐదుసార్లు నవీన్ పట్నాయక్ ను గెలిపించారని గుర్తు చేస్తూ.. ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నా తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకునేలా కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఇలా 30 నిమిషాల ప్రసంగంలోనే అన్ని అంశాలను టచ్ చేయడం ద్వారా తనలో పరిణితిని మంత్రి లోకేశ్ చాటుకున్నట్లు అయిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పప్పు అంటూ అవమానాలు, బాడీ షేమింగుకు గురైన లోకేశ్ ఇప్పుడు అందుకు పూర్తి విరుద్దంగా కనిపిస్తున్నారని, మాట తీరే కాకుండా బాడీ లాంగ్వేజ్ కూడా మారిందని అంటున్నారు. మొత్తానికి మహానాడుతో లోకేశ్ తనలో పరిపూర్ణ లీడర్ ను ఆవిష్కరించారని ప్రశంసలు అందుకుంటున్నారు.