Begin typing your search above and press return to search.

జేసీల‌కు టీడీపీ ఏంటో ఇప్పుడు తెలిసొచ్చిందా?!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ర‌గులుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   18 July 2023 5:21 PM GMT
జేసీల‌కు టీడీపీ ఏంటో ఇప్పుడు తెలిసొచ్చిందా?!
X

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ర‌గులుతూనే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే వైసీపీ వ‌ర్సెస్ జేసీ బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ఈ క్ర‌మంలో అనూహ్యంగా బ్ర‌దర్ ఆఫ్ జేసీస్‌.. ప్ర‌భాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఆయ‌న తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు అస్మిత్‌రెడ్డిని రంగంలోకి దింపారు.

ఇక‌, ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోనే ఉన్నా.. అసెంబ్లీకి పోటీ చేసేది లేద‌ని అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. కానీ, కుమారుడి ఓట‌మి, అదేస‌మ యంలో వైసీపీనేత పెద్దారెడ్డి విజ‌యం త‌ర్వాత‌.. జేసీల కంచుకోట‌కు బీట‌లు ప‌డుతూ వ‌చ్చాయి. ఇక్క‌డ బ‌ల‌మైన జేసీ వ‌ర్గాన్ని దెబ్బ‌తీసే వ్యూహాల‌ను ఎమ్మెల్యే అమ‌లుచేశార‌నేది ప‌రిశీల‌కుల మాట‌. ఎప్ప‌టిక‌ప్పుడు వీటిని తిప్పికోడుతున్నా.. జేసీ వ‌ర్గాన్ని పెద్దారెడ్డి వ‌దిలి పెట్ట‌డం లేదు. దీంతో జేసీ ప్ర‌భాక‌ర్ అనూహ్యంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు ప‌దే ప‌దే చెప్పారు.

అంతేకాదు.. త‌న‌కు కార్య‌క‌ర్త‌లే ప్రాణ‌మ‌ని చెప్పారు. కార్య‌క‌ర్త‌లు లేకుండా.. తాను లేన‌ని తొలిసారి వ్యాఖ్యానించారు. కార్యకర్తల అండ లేకపోతే తనకు 3 మార్గాలున్నాయన్నారు. మొదటిది ఆత్మహత్య, రెండవది ఊరు విడిచి పారిపోవడం, మూడోది ఎమ్మె ల్యేకు కప్పం కట్టడం అని తేల్చేశారు. అయితే.. ఇంత సంచ‌ల‌న వ్యాఖ్య‌ల మ‌ర్మ‌మేంటి? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు జేసీల రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. అప్ప‌ట్లో కాంగ్రెస్‌లో ఉన్నా.. 2014లో టీడీపీలోకి వ‌చ్చినా.. త‌మ బ‌ల‌మే కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. అనేక సంద‌ర్భాల్లో టీడీపీని అసలు ప‌ట్టించుకోలేద‌నే వాద‌న కూడా ఉంది.

ఇది 35 ఏళ్ల‌పాటు ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన ప్ర‌భావం కావొచ్చు. కానీ, ఇప్పుడు వాస్త‌వం ఏంటో జేసీల‌కు బోధ‌ప‌డుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. క్షేత్ర‌స్తాయిలో వ్య‌క్తిగ‌త బ‌లం క‌న్నా.. పార్టీ బ‌లం ఉంటేనే త‌మ గెలుపు సాధ్య‌మ‌ని గుర్తించిన‌ట్టు తోస్తోంద‌ని అంటున్నారు. అందుకే.. గ‌త రెండేళ్ల కింద‌ట ఉన్న రాజ‌కీయాల్లో మార్పు చోటు చేసుకుంద‌ని చెబుతున్నారు. తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఎన్నికైన‌ప్పుడు కానీ.. దీనికి ముందు కానీ.. టీడీపీని ప‌క్క‌న పెట్టిన జేసీలు.. ఇప్పుడు పార్టీ అండ‌కోసం.. కార్య‌క‌ర్త‌ల బ‌లం కోసం వెంప‌ర్లాడుతుండ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు.