Begin typing your search above and press return to search.

టీడీపీ మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌కు తిరుమంగ‌ళ‌మేనా ..!

మాజీ మంత్రి.. కొత్త‌ప‌ల్లి శ్యామ్యూల్ జ‌వ‌హ‌ర్ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న రాజ‌కీ యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?

By:  Tupaki Desk   |   6 April 2025 9:34 AM IST
టీడీపీ మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌కు తిరుమంగ‌ళ‌మేనా ..!
X

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. కొత్త‌ప‌ల్లి శ్యామ్యూల్ జ‌వ‌హ‌ర్ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న రాజ‌కీ యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అటు చంద్ర‌బాబు నుంచి ఆద‌ర‌ణ కొర‌వ‌డి.. ఇటు.. నాయ‌కు లు కూడా ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించిన ఆయ‌న‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. పైగా ఎక్క‌డో ఉన్న గుంటూరుకు చెందిన కొలిక పూడి శ్రీనివాస‌రావుకు టికెట్ ఇచ్చారు. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. కొలిక‌పూడి రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. జ‌వ‌హ‌ర్ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌న్న‌ది త‌మ్ముళ్లు చెబుతున్న మాట‌. ఎవ‌రూ ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా.. ఆయ‌న పేరు కూడా ఎక్క‌డా వినిపిం చడం లేదు. వాస్త‌వానికి ప‌ద‌వుల‌తో సంబంధం లేకుండా.. పార్టీ కోసం శ్ర‌మించే వారిలో జ‌వ‌హ‌ర్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. అయితే.. కొన్ని స‌మీక‌ర‌ణలు.. మ‌రికొన్ని ఇబ్బందుల కార‌ణంగా జ‌వ‌హ‌ర్‌ను చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో త‌ప్పించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ప‌రిస్తితి ఇబ్బందిగానే మారింద‌ని తెలుస్తోంది.

తిరువూరు సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మే అయినా.. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. విప‌క్షం వైసీపీపై ఒక‌ప్పు డు సూటి పోటి మాట‌ల‌తో రాజ‌కీయాలు చేసిన జ‌వ‌హ‌ర్‌.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పినా.. త‌న‌కు ఇవ్వ‌లేదన్న ఆవేద‌న ఒక‌వైపు ఉంది. మ‌రోవైపు.. ఎమ్మెల్యే దూకుడు కార‌ణం గా.. కొంద‌రు పార్టీ నాయ‌కులు సైలెంట్ కావ‌డం.. జ‌వ‌హ‌ర్‌కు మ‌ద్ద‌తు ప‌లికితే.. కొలిక‌పూడి త‌మ‌పై యుద్ధం చేస్తార‌న్న బెంగ కూడా.. వారిని వెంటాడుతోంది.

ఇది అంతిమంగా పార్టీకి న‌ష్టం చేసేలా ఉంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంలో ఎమ్మెల్యే వెనుక‌బ‌డుతున్న విష‌యాన్ని చాలా మంది ప్ర‌స్తావిస్తున్నారు. ఈ గ్యాప్‌ను జ‌వ‌హ‌ర్ వినియోగించుకునేందుకు అవ‌కాశం ఉన్నా.. ఆయ‌న ఎక్క‌డా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 2014లో విజ‌యం ద‌క్కించుకుని.. మంత్రి అయ్యాక‌.. ఒక వెలుగు వెలిగిన జ‌వ‌హ‌ర్‌.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మైన‌స్ అయిపోయార‌ని పార్టీ నాయ‌కులు కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని వ‌దులుకోకూడ‌ద‌న్న‌ది వారి స‌ల‌హా. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.