టీజీ వర్సెస్ కేఈ.. కర్నూలులో పొలిటికల్ సెగ ..!
కర్నూలు రాజకీయాలు భగభగమంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య హోరు.. జోరు ఎక్కువగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 25 May 2025 7:00 AM ISTకర్నూలు రాజకీయాలు భగభగమంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య హోరు.. జోరు ఎక్కువగా కనిపిస్తోంది. కర్నూలు ఎమ్మెల్యే.. మంత్రి టీజీ భరత్‌పై సీనియర్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఆయన తమను పట్టించుకోవడం లేదని.. ఒంటెత్తు పోకడలు పోతున్నారని కూడా.. నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా జరిగిన మినీ మహానాడు వేదికగా.. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ నేరుగానే విమర్శలు ఎక్కు పెట్టారు.
నాయకులకు, కార్యకర్తలకు మంత్రి భరత్ అసలు అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వడం లేదన్న చర్చ కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. పైగా.. ఆయన వైసీపీ నాయకులకు టచ్‌లో ఉన్నారని.. చాపకింద నీరుగా వారికి అవసరమైన పనులు చేసి పెడుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఈ వ్యవహారమే పార్టీ నాయకుల కు భరత్‌కు మధ్య భారీ గ్యాప్‌ను పెంచేసింది. ఇది తాజాగా బట్టబయలైంది. పద్ధతి మార్చుకోకపోతే తానే రంగంలోకి దిగి పని కేఈ ప్రభాకర్ హెచ్చరించడం పార్టీలో కలకలం రేపింది.
అంతేకాదు.. మంత్రికే కేఈ ప్రభాకర్ షరతు విధించారు. మంత్రి పనితీరు మార్చుకునేందుకు తాను 2 మాసాల గడువు ఇస్తున్నట్టు బహిరంగ వేదికపైనే చెప్పుకొచ్చారు. అయితే.. ఈ మినీ మహానాడుకు మంత్రి టీజీ భరత్ రాకపోవడం గమనార్హం. అయితే.. మాట్లాడిన నాయకుల్లో ఎక్కువ మంది మంత్రి చుట్టూనే ఫోకస్ చేయడం గమనార్హం. ఇతర నాయకులు కూడా మంత్రి వ్యవహార శైలిని తప్పుబట్టారు. అప్పాయిం ట్ మెంటు ఇవ్వకపోవడాన్ని ఎక్కువ మంది తప్పుబట్టారు.
ఇక, మిగిలిన నాయకులు.. కొందరు వైసీపీతో మంత్రి మిలాఖత్ అయ్యారన్న వాదనను బలంగా వినిపిం చారు. వాస్తవానికి మినీ మహానాడుల ఉద్దేశం.. పార్టీలో కార్యక్రమాలపై చర్చించి.. స్థానిక సమస్యలపై చర్చించి.. తీర్మానాలు చేయడం. వీటిని తర్వాత నిర్వహించే మహానాడులో ప్రస్తావించి.. కార్యాచరణకు పూనుకోవాలన్నది పార్టీ అధినేత ఆదేశం. అయితే.. దీనికి భిన్నంగా నాయకులు తమ వ్యక్తిగత అంశాలతో రెచ్చిపోతున్నారు. నిజానికి కర్నూలు నియోజకవర్గంలో సమస్యలు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాయన్నది పార్టీలోనూ చర్చకు వస్తున్న విషయం తెలిసిందే.
