Begin typing your search above and press return to search.

ఎస్‌.. జ‌రిగిందే చెప్పా.. చంద్ర‌బాబు దేవుడు: కొలికపూడి వివ‌ర‌ణ‌?

టీడీపీ నాయ‌కుడు, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస‌రావు తాజాగా మంగ‌ళ‌వారం పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం ముందు హాజ‌ర‌య్యారు.

By:  Garuda Media   |   4 Nov 2025 11:20 PM IST
ఎస్‌.. జ‌రిగిందే చెప్పా.. చంద్ర‌బాబు దేవుడు:  కొలికపూడి వివ‌ర‌ణ‌?
X

టీడీపీ నాయ‌కుడు, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస‌రావు తాజాగా మంగ‌ళ‌వారం పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం ముందు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సుమారు 4 గంట‌ల పాటు ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. టీడీపీ క్ర‌మ శిక్ష‌ణ సంఘం లో వ‌ర్ల రామ‌య్య‌, మాజీ ఎంపీ, ప్ర‌స్తుత ఆర్టీసీ చైర్మ‌న్ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, ఎమ్మెల్సీ పంచుమ‌ర్తి అనురాధ త‌దిత‌రులు ఉన్నా రు. వీరి ముందు హాజ‌రైన కొలిక‌పూడి.. గ‌తంలో తాను చేసిన వ్యాఖ్య‌లు.. ఓ టీవీ చ‌ర్చ‌లో చెప్పిన విష‌యాలు అన్నీ వాస్త‌వాలే న‌ని మ‌రోసారి చెప్పారు.

అయితే.. ఏవిష‌యం అయినా.. బ‌హిరంగ వేదిక‌ల‌పై చెప్ప‌రాద‌ని.. అంత‌ర్గ‌తంగా చెప్ప‌వ‌చ్చ‌న్న విష‌యం తెలియ‌దా? అన్న ప్ర‌శ్నకు.. కొలిక‌పూడి స్పందిస్తూ..తాను నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను గ‌తంలోనే క్ర‌మ‌శిక్ష‌ణ సంఘానికి చెప్పాన‌ని.. తాను కూడా ప్ర‌జాప్ర‌తినిధినేన‌ని.. త‌న‌కు కూడా ఆత్మగౌర‌వం ఉంటుంద‌ని అందుకే వ్యాఖ్యానించాన‌ని బ‌దులిచ్చారు. అక్ర‌మాలు అన్యాయాలు జ‌రుగుతున్నాయి కాబ‌ట్టే తాను బ‌య‌ట‌కు చెప్పాన‌న్నారు. అయితే.. పార్టీ విధి విధానాల‌కు తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని.. చంద్ర‌బాబు అంటే దైవ‌మ‌ని కొలిక‌పూడి వ్యాఖ్యానించారు.

అనంత‌రం.. 156 పేజీలతో కూడిన నివేదిక‌ను క్ర‌మ‌శిక్ష‌ణ సంఘానికి అందించారు. ఇదిలావుంటే.. క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు కొలిక‌పూడి స‌మాధానాన్ని దాట వేసిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్తున్నారా? ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌చారం చేస్తున్నారా? ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ప్ర‌జాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు అన్న‌దానికి.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే చేస్తున్నాన‌ని స‌మాధానం ఇచ్చారు త‌ప్ప‌.. ఆధారాల‌తో స‌హా జ‌వాబు ఇవ్వ‌లేద‌ని తెలిసింది. కాగా.. నియోజ‌క‌వ‌ర్గం లో వివాదాలు ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు, ఆ విష‌యాన్ని ఎంపీని కూడా ప్ర‌శ్నించాల‌న్నార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

ఏంటీ వివాదం..

ఇటీవ‌ల చంద్ర‌బాబు దుబాయ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన నేప‌థ్యంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్నీని టార్గెట్ చేస్తూ..కొలిక పూడి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గ‌త 2024 ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇచ్చేందుకు రూ.5 కోట్లు తీసుకున్నార‌ని.. త‌న నియోజ‌క‌వ ర్గంలోత‌న‌కు చెప్ప‌కుండానే వ‌స్తున్నార‌ని, రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. ఆరోపించారు. ఈ క్ర‌మంలో కొలిక‌పూడి ప‌లు బ్యాంకు స్టేట్ మెంట్ల‌ను వాట్సాప్ స్టేట‌స్‌లో ఉంచారు. ఇది పెను సంచ‌ల‌నంగా మార‌డంతో చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క్ర‌మ శిక్ష‌ణ సంఘం ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు.