లోకల్ ఫైట్ : అతి పెద్ద డైలమాలో వైసీపీ ?
ఏపీలో స్థానిక సంస్థల సమరానికి తెర లేస్తోంది. అధికార టీడీపీ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలను నిర్వహించాలని పట్టుదలగా ఉంది.
By: Satya P | 17 Feb 2026 10:00 AM ISTఏపీలో స్థానిక సంస్థల సమరానికి తెర లేస్తోంది. అధికార టీడీపీ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలను నిర్వహించాలని పట్టుదలగా ఉంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను అంతా జూన్ నాటికి పూర్తి చేయాలని కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకుంది అని అంటున్నారు. ఏపీ బడ్జెట్ సైతం స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ రూపొందించారు అని అంటున్నారు. ఒక చూస్తే ఏపీలో రాజకీయ వాతావరణం కూడా కూటమికి అనుకూలంగా ఉంది అని అంటున్నారు.
పొరుగున ఫలితం :
అంతే కాదు పొరుగున ఉన్న తెలంగాణా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పూర్తిగా అధికార కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయని కూడా గుర్తు చేస్తున్నారు. అదే మాదిరిగా ఏపీలో కూడా మంచి ఫలితాలు తాము సాధిస్తామని కూటమి నేతలు మంచి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి గెలిచిందని మూడు పార్టీల కూటమి ఫుల్ స్ట్రాంగ్ గా ఉందని పైగా వైసీపీ పెద్దగా సంస్థాగతంగా పుంజుకోలేదని కూడా కూటమి పెద్దలు అంచనా కడుతున్నారు. దాంతో ఇపుడు ఎన్నికలు పెడితే నూరు శాతం సీట్లను గెలుచుకోవచ్చు అన్నది వారి ఆలోచనగా ఉంది. అదే సమయంలో స్థానిక పదవులు మూడు పార్టీలు పంచుకోవడం ద్వారా గ్రౌండ్ లెవెల్ లో మరింత గట్టిగా నిలిచేందుకు వీలు కలుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
వైసీపీలో తర్జన భర్జన :
ఇక విపక్షంలో ఉన్న వైసీపీ స్థానిక సంస్థల విషయంలో తర్జన భర్జన పడుతోంది అని అంటున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. ఎక్కడైనా స్థానిక ఫలితాలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. తాజాగా తెలంగాణాలో జరిగినది కూడా అదే అని అంటున్నారు. 2021లో వైసీపీ కూడా ఇదే రకమైన ఫలితాలను అందుకుందని ఇపుడు ప్రతిపక్షంలో ఉండడం చేత ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. పోటీ చేసి ఓటమి చెందామని అనిపించుకోవడం కంటే బాయ్ కాట్ చేసి గమ్మున ఉండడం వల్ల గౌరవంగా ఉంటుందా అన్న ఆలోచన కూడా పార్టీలో జరుగుతోంది అని అంటున్నారు. ఈ విషయంలో తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు.
పోటీకి దిగితేనే :
అయితే మరో వైపు చూస్తే పోటీకి దిగాల్సిందే అన్న మాట కూడా వినిపిస్తోంది. అవుట్ రేట్ గా అధికార పార్టీకి వదిలేస్తే వైసీపీ క్యాడర్ డీ మోరలైజ్ అవుతుందని అంటున్నారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు డీలా పడతారని ఆ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో కూడా కనిపిస్తుందని అంటున్నారు. దాదాపుగా రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న కూటమి మీద ప్రజా వ్యతిరేకత ఉందని గట్టి అభ్యర్థులను పెట్టి చిత్తశుద్ధితో పోరాడితే వైసీపీకి మేలు జరుగుతుందని వాదించే వారూ ఉన్నారని అంటున్నారు. తెలంగాణాలో ఎంత అధికార కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ అలాగే బీజేపీ సైతం చెప్పుకోదగిన ఫలితాలను సాధించాయని గుర్తు చేస్తున్నారు. పైగా క్యాడర్ గేరప్ అయిందని ఏపీలో వైసీపీకి కూడా ఇది చాలా అవసరం అని అంటున్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది అధినాయకత్వం అని అంటున్నారు.
పల్లె పోరుతోనే :
ఇక ఏపీలో స్థానిక సమరం పల్లె పోరుతో మొదలై కార్పోరేషన్ పోరుతో ముగుస్తుందని అంటున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని చూస్తున్నారు. ఆ మీదట జిల్లా మండల పరిషత్తులకు, చివరిగా మునిసిపాలిటీలకు కార్పోరేషన్లకు ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నారు. బడ్జెట్ సెషన్ పూర్తి అయిన తరువాత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతుందని అంటున్నారు.
