కూటమి లెక్కలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి.. !
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర మాసాలు అవుతోంది. ఈ సమయంలో ప్రధానంగా ఉన్న రెండు పార్టీల్లో కొందరు ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకున్నారు.
By: Garuda Media | 31 July 2026 8:00 PM ISTకూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర మాసాలు అవుతోంది. ఈ సమయంలో ప్రధానంగా ఉన్న రెండు పార్టీల్లో కొందరు ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకున్నారు. సహజంగానే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రత్యర్థులు దానిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వైసీపీ కూడా ఇదే పనిచేసింది. 2025లో ఘర్ వాపసీ మంత్రాన్ని పఠించింది. అంటే.. తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి ఆహ్వానించేందు కు జగన్ స్వయంగా ఈ పిలుపునిచ్చారు.
కానీ, ఒక్కరు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరలేదు. ఇదిలావుంటే.. అసలు వివాదాల్లో చిక్కుకున్న వారిపై టీడీపీ, జనసేనలు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. వారిపై వస్తున్న విమర్శలను సీరియస్‌గా తీసుకుంటూనే.. మరోవైపు వైసీపీకి చాన్స్ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నాయి. వివరణలు, విచారణలు పేరుతో నాయకులను హెచ్చరిస్తూ.. మరోవైపు.. వైసీపీ నేతలు చొరబడి.. తమ వారిని ఆకర్షించకుండా కూడా వ్యూహాలు వేస్తూ ముందుకు సాగుతున్నాయి.
ఈ పరిణామాలే లేకపోయి ఉంటే.. ఇప్పటికి వైసీపీలో చాలా మంది చేరేవారన్న చర్చ ఉంది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నుంచి కొలికపూడి శ్రీనివాసరావు వరకు.. చాలా మంది వివాదాలకు కేంద్రంగా మారినా.. టీడీపీ చాలా ఆచితూచి అడుగులు వేసింది. వారిని హెచ్చరిస్తూనే పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగింది. పదే పదే లెక్కలు తప్పులు చేస్తున్న నాయకులను కూడా దారిలో పెట్టుకునే ప్రయత్నంతో ముందుకు వెళ్లింది.
ఈ తరహా పరిస్థితి వైసీపీకి చెక్ పెట్టడంతోపాటు.. టీడీపీ,జనసేన నాయకుల్లోనూ ఆత్మ పరిశీలన చేసుకునేందుకు అవకాశం ఇచ్చేలా చేశాయి. అదే వైసీపీలో అయితే.. వేరేగా ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో వైసీపీ ఘర్ వాపసీ మంత్రం పెద్దగా ఫలించలేదు. పైగా.. కూటమి నేతలను కూడా వస్తారన్న ఆశలనుంచి బయటకు వచ్చింది. మొత్తంగా కూటమి పార్టీల్లో విచారణలు, వివరణలు కామనే అనే టాక్ వినిపిస్తున్నా.. వైసీపీకి అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నారన్న వ్యూహం మాత్రం పక్కాగా అమలవుతోంది.
