తూర్పు నుంచి పశ్చిమానికి `వర్మ` సెగలు ..!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో వర్మ త్యాగం చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 April 2025 10:15 PM ISTఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో వర్మ త్యాగం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ సీనియర్ నాయకుడిగా బలమైన కేడర్ ఉన్న వ్యక్తిగా ఆయన గెలుపు తథ్యమని అందరూ భావించిన సమయంలో అనూహ్యం గా చంద్రబాబు ఆయనను పక్కన పెట్టి.. జనసేనకు టికెట్ ఇచ్చారు. పైగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపులోనూ.. వర్మ కీలకంగా వ్యవహరించారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. ఎన్నికల సమయంలో వర్మకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.పైగా పిఠాపురంలో వర్మకు ఎదురు గాలి వీస్తోంది.
జనసేన దూకుడు పెంచడం.. నాగబాబు కీలకంగా వ్యవహరించి పిఠాపురంలో సత్తా చాటేలా.. ప్రయత్నాలు చేస్తుండడంతో వర్మ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే.. తెంచుకోలేక.. కొనసాగలేక.. ఆయన ఇబ్బంది పడుతున్నారు. అయితే.. ఈ వ్యవహారా న్ని నిశితంగా గమనిస్తున్న మరికొందరు టీడీపీ నాయకులు ఇప్పుడు పార్టీపై వత్తిడి పెంచుతున్నారు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాయకులు కావడం గమనార్హం. గత ఎన్నికల్లో వీరు కూడా పార్టీ కోసం త్యాగాలు చేసిన వారే. పైగా వీరంతా జనసేన కోసం టికెట్లను త్యాగం చేసిన వారే. చంద్రబాబు మాట విని.. జనసేన నాయకులను గెలిపించారు కూడా. కానీ, వీరు కూడా ఇబ్బందుల్లోనే పడ్డారు.
అంటే.. ఒకరకంగా.. వర్మ సెగ.. ఇప్పుడు తూర్పు నుంచి పశ్చిమానికి పాకింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఆరు నియోజ కవర్గాలను టీడీపీ వదులకుంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన పాగా వేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, ఉంగుటూరు, నిడదవోలు, నరసాపురం,భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగిరింది. ఈ ఆరు చోట్ల త్యాగాలు చేసిన టిడిపి ఇంఛార్జిల్లో ఒక్క పోలవరం నియోజకవర్గ ఇంఛార్జికి మాత్రమే ఏపీ ట్రైకార్ చైర్మన్ పోస్ట్ దక్కింది. మిగిలిన ఐదు చోట్ల నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇక, కీలకమైన ఉంగుటూరు విషయంలో చివరి వరకు టీడీపీ పోటీ చేస్తుందని అనుకున్నారు. కానీ, ఫైనల్‌గా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అంతేకాదు.. అక్కడి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజును గెలిపించే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత,ప్రజల నేతగా గుర్తింపు పొందిన గన్ని వీరాంజనేయులుకు అప్పగించారు. ఆయన ఎంతో శ్రమించి ధర్మరాజుకు విజయం దక్కేలా చేశారు. కానీ.. ఇప్పటికీ చంద్రబాబు కరుణించలేదు. ఈయన ఒక్కరే కాదు.. వలవల బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు, నిడదవోలు నుంచి రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సైతం పార్టీ నుంచి ఊరట లేదు. దీంతో వీరంతా వర్మ విషయాన్ని తలుచుకుని కుములుతున్నారు.
