టీడీపీ విత్ జనసేన : గొడవలు రాకుండా సర్దుబాటు కుదురుతుందా ?
అలాంటివి రెండు మూడు పార్టీలు కలసి పొత్తు పెట్టుకున్నప్పుడి సమస్యలు రావడం సహజం. అందున్నా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తు ఎపుడూ సవాల్ గానే ఉంటుంది.
By: Satya P | 21 Aug 2026 1:48 PM ISTపొత్తు పార్టీలతో సానుకూలతలు ఎన్ని ఉంటాయో ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి. ఒకే పార్టీలోనే విభేదాలు ఉంటున్న రోజులివి. అలాంటివి రెండు మూడు పార్టీలు కలసి పొత్తు పెట్టుకున్నప్పుడి సమస్యలు రావడం సహజం. అందున్నా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తు ఎపుడూ సవాల్ గానే ఉంటుంది. ఇద్దరి లక్ష్యాలు ఒక్కటే అయినపుడు సర్దుబాటులో కూడా పొరపాట్లు వస్తాయి. ఏపీలో టీడీపీ కూటమిలో ఇపుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే కూటమి పొత్తులకు అతి పెద్ద పరీక్షగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని అంటున్నారు.
పవన్ స్ట్రాంగ్ డెసిషన్ :
2024 ఫార్ములా అన్నది పాతది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చేశారు. 2026 రెండో భాగంలో ఉన్నామిపుడు అన్నది ఆయన భావన. ఈ మధ్య కాలంలో జనసేన బాగా పెరిగింది అని కూడా లెక్క వేస్తున్నారు. దాంతో జనసేన తన వాటాను స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగానే పెంచుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు కూటమిలో పెద్దన్న టీడీపీతో సరైన సర్దుబాటు కుదురుతుందని కూడా జనసేనాని పవన్ ఆశిస్తున్నారు. అందుకే ఆయన ఒక్కటే మాట అంటున్నారు. టీడీపీ బీజేపీ జనసేనలతో ఐక్యతను కాపాడుకుంటూనే జనసేన తనకు కావాల్సిన సీట్లను సాధించుకుంటుంది అన్నది. ఇక మీ పనులలో మీరు ఉండండి, పార్టీని బలోపేతం చేసుకుంటూ పోటీకి సిద్ధంగా ఉండాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
త్యాగాలు ఇక వద్దు :
క్షేత్ర స్థాయిలో జనసేనలో ఎన్నో ఆశలు ఉన్నాయి. మరెన్నో ఆకాంక్షలు ఉన్నాయి. అంతే కాదు జనసేనకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యం. సంస్థాగతంగా పార్టీ బలపడడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ బలమైన పునాది పడితే అది సార్వత్రిక ఎన్నికలకు జనసేనకు పటిష్టం అయిన పధక రచనకు వీలు కల్పిస్తుంది అని కూడా భావిస్తున్నారు. పైగా జనసేనను నమ్ముకుని ఏళ్ళుగా పనిచేస్తున్న క్యాడర్ కి సరైన న్యాయం అందించాలంటే స్థానిక ఎన్నికల్లోనే వారికి సముచితమైన స్థానం కల్పించడమే మార్గం అని కూడా ఆయన భావిస్తున్నారు అని చెబుతున్నారు.
కొత్త ఫార్ములాతోనే :
జనసేన ఈ నేపథ్యంలో కొత్త ఫార్ములాతోనే ముందుకు వస్తుందని అంటున్నారు. జనసేన ఓటు షేర్ కచ్చితంగా 15 నుంచి 20 శాతం దాకా ఉంటుందని కూడా పార్టీ వర్గాలు అంటున్నారు. ఈ లెక్కనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీటు షేరింగ్ ఉండాలని ఆశిస్తున్నారు. మరో రెండు నెలలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు ఎటూ ఉంటాయి కాబట్టి 2024 ఎన్నికల్లో మాదిరిగా సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విజయం సాధిస్తే 2029లో అధికారం దిశగా జనసేన గట్టిగా ఆలోచించేందుకు కూడా ఆస్కారం ఏర్పడుతుందని అధినాయకత్వం భావిస్తోంది. ఇక ఈ క్రమంలో 30 శాతం పైగా సీట్లను జనసేన కోరనుంది అని కూడా ప్రచారం సాగుతోంది.
గొడవలు లేకుండానే :
ఇక్కడ ఒక విషయం ఉంది. జనసేన అధినేత పవన్ రాజకీయ పరిణతి కలిగిన వారే. అదే సమయంలో చంద్రబాబు కూడా ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే అని అంటున్నారు. అందువల్ల ఈ ఇద్దరూ కలసి కూర్చుంటే ఎలాంటి గొడవలు రాకుండా సీటు షేరింగ్ అన్నది జరిగిపోతుంది అని కూడా రెండు పార్టీలలో ఆశ ఉంది. 2024 వ్యూహం ఎటూ జనసేన ఒప్పుకోదు కాబట్టి టీడీపీ కూడా కొంత తగ్గి ఆలోచిస్తుంది అని అంటున్నారు. ఎక్కువ సీట్లు మిత్ర పక్షంగా జనసేన కోరడం సహజం. అయితే ఎక్కడ ఎక్కువ బలం ఉంది, గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది ఆలోచించుకుని సీట్ షేరింగ్ జరుపుకుంటే సమస్య అన్నది ఉత్పన్నం కాదని అంటున్నారు.
తమ్ముళ్లను ఒప్పించాలి :
టీడీపీ విషయం చూస్తే బూత్ లెవెల్ వరకూ పాతుకుని పోయిన పార్టీ అది. ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. కోటికి దాటిన సభ్యత్వం ఉంది. దాదాపుగా స్థానికంగా పటిష్టంగా ఉన్న పార్టీ అది. స్థానిక ఎన్నికల్లో పోటీకి టీడీపీ తమ్ముళ్ళు కూడా ఎంతగానో ఉత్సాహం చూపిస్తున్నారు. మరి వారిని సముదాయించి దారికి తేవడమే అధినాయకత్వం ముందు ఉన్న సవాల్ అని అంటున్నారు. అలా కనుక జరిగితే కధ సుఖాంతం అవుతుంది. లేకపోతే ఇబ్బందులు వస్తాయి కూటమి ఐక్యతకు కూడా అది బీటలు వార్చేసే పరిస్థితికి దారి తీస్తుంది అని అంటున్నారు. మరో వైపు కూటమికి ఉమ్మడి ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. ఈ పరిణామాలు అన్నీ నిశితంగా వైసీపీ పరిశీలిస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు పవన్ కలిసి కూర్చుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
