15 ఏళ్ల కూటమి: బీజేపీ స్టాండ్ ఏంటి ..!
రాష్ట్రంలో కూటమి కట్టిన టీడీపీ-జనసేన-బీజేపీలు అధికారంలోకి వచ్చాయి. మంత్రి పదవులు పంచుకున్నాయి.
By: Garuda Media | 11 Dec 2025 10:00 PM ISTరాష్ట్రంలో కూటమి కట్టిన టీడీపీ-జనసేన-బీజేపీలు అధికారంలోకి వచ్చాయి. మంత్రి పదవులు పంచుకున్నాయి. కీలకమైన వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి.. వాయిస్ లేకుండా చేశాయి. ఇప్పటి వరకు బాగానే ఉంది. మళ్లీ వచ్చే ఎన్నికలకు పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల నాటికి కూడా కూటమి ఇలానే ఉంటుందా? అంటే.. టీడీపీ అధినేతగా చంద్రబాబు, జనసేన చీఫ్‌గా పవన్ కల్యాణ్.. ఔననే చెబుతు న్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే చెబుతున్నారు.
మరో 15 ఏళ్లపాటు ఈ కూటమి కలిసే ఉంటుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు. ఈ విష యంలో పవన్ కల్యాణ్ మరింత ఎక్కువగానే చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు తెరమీదికి వచ్చినప్పుడు కూడా సర్దుకు పోవాలని హితవు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. మరో రెండు ఎన్నికల వరకు కూడా కలిసి ఉంటేనే ప్రయోజనం ఏర్పడుతుందని పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా వివరిస్తున్నారు. తద్వారా కూటమి కలివిడిని ఆయన పెంచుతున్నారు.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తరచుగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. 15 సంవ త్సరాల పాటు కూటమి కలివిడిగానే ఉంటుందని.. పవన్ కల్యాణ్ చెబుతున్న వాస్తవాన్ని అందరూ గమ నించాలని కూడా ఆయన చెబుతున్నారు. మరి ఇదే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ స్టాండేటి ?.. 15 ఏళ్లపాటు కూటమిగా ఉండాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎలా ఆలోచన చేస్తోంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
ఇప్పటికైతే.. బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. ఇటువైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పదే పదే 15 ఏళ్ల ఐక్యతపై కామెంట్లు చేస్తున్నా.. బీజేపీ నుంచి సీనియర్లుగా ఉన్న సోము వీర్రాజు కానీ.. పురందేశ్వరి కానీ.. మౌనంగానే ఉంటున్నారు. ఇక, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ అయితే.. ఎక్కడా నోరు విప్పడం లేదు. మరోవైపు.. కేంద్రంలోని పెద్దలకు ఈ విషయం తెలుసో.. తెలియకో.. వారు కూడా సైలెంట్ అవుతున్నారు. దీంతో బీజేపీ స్టాండ్ ఏంటి? వచ్చే 15 ఏళ్లు కూటమిలో ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
