అధినేతలు కాదంటున్నా.. కామన్ గా కూటమి కార్యకర్తల కొట్లాట?
కూటమిలోని మూడు పార్టీలు ఉండగా, టీడీపీ-జనసేన మధ్య అవగాహన కొరవడుతోందన్న టాక్ రెండు పార్టీల అగ్రనేతలకు టెన్షన్ పెడుతోందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 8 Sept 2026 6:49 PM ISTకూటమి పార్టీల మధ్య సమన్వయం కత్తిమీద సాములా మారుతోందని టాక్ వినిపిస్తోంది. కూటమిలోని మూడు పార్టీలు ఉండగా, టీడీపీ-జనసేన మధ్య అవగాహన కొరవడుతోందన్న టాక్ రెండు పార్టీల అగ్రనేతలకు టెన్షన్ పెడుతోందని అంటున్నారు. కూటమిగా కలిసివుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నా ఇరువైపులా కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతివిమర్శలతో పొలిటికల్ టెంపరేచర్ పెంచేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రెండు పార్టీల కార్యకర్తల ఆవేశంతో ప్రస్తుత రాజకీయాలకు సంబంధం లేని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, జనసేనాని పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని మధ్యలోకి లాగుతున్నారని చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల ముందు కూటమిలో ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఎవరెవరిని బరిలోకి దింపాలనే ప్రధాన చర్చ జరగాల్సివుండగా, ప్రస్తుతం రెండు పార్టీల సోషల్ మీడియా బృందాలు మీ ఎమ్మెల్యే పనిచేయలేదంటే.. మీ ఎమ్మెల్యే పనిచేయడం లేదంటూ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కొనసాగింపుగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు, ఇతర వ్యవహారాలపైనా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ప్రధానంగా ఇటీవల నరసాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించిన సందర్భంగా అక్కడి జనసేన ఎమ్మెల్యే నాయకర్ పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించిన తర్వాత ఈ వివాదాలు ఎక్కువ అయ్యాయని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆధినేతగా చంద్రబాబు అధికార కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై కామెంట్లు చేయడాన్ని అవకాశంగా తీసుకుని కొందరు అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సీఎం నరసాపురం పర్యటన తర్వాత గతంలో జనసేనలో పనిచేసిన ఓ నాయకుడు సోషల్ మీడియాలో సీఎం ప్రశ్నించడాన్ని తప్పుబట్టేలా పోస్టింగ్ చేయడంతో ఇరుపార్టీల మధ్య రచ్చ ఎక్కువైందని అంటున్నారు. కూటమిలో చిచ్చు రాజేసేలా ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టు చేశారని టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తుండగా, జనసేన అభిమానిగా ఆ మాజీ నేత చేసిన పోస్టింగును జనసైనికులు సమర్థిస్తున్నారని అంటున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోందని చెబుతున్నారు.
వాస్తవానికి ఇరుపార్టీల అగ్రనాయకులు కూటమి ఎమ్మెల్యేల పనితీరు విషయంలో పార్టీలకు అతీతంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా మంత్రి అనిత పనితీరును తప్పుబట్టారని కానీ అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని అంటున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన ఎమ్మెల్యే విషయంలో కామెంట్స్ చేయడాన్ని వేలెత్తిచూపడమే రాజకీయ వివాదంగా మార్చాలని చూస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ విషయం గమనించకుండా ఇరుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకుంటుండటంతో కూటమి ఐక్యతపై ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
