Begin typing your search above and press return to search.

మైల‌వ‌రం టీడీపీలో ర‌గ‌డ‌.. సొంత వారిపైనే కేసులా..?

ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు కావ‌డం.. స‌ద‌రు నేత‌ల‌ను పోలీసులు.. రోడ్డుపైనే న‌డిపించుకుని తీసుకువెళ్ల‌డం వంటివి సంచ‌ల‌నంగా మారాయి.

By:  Garuda Media   |   5 Jun 2026 5:00 AM IST
మైల‌వ‌రం టీడీపీలో ర‌గ‌డ‌.. సొంత వారిపైనే కేసులా..?
X

ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు కావ‌డం.. స‌ద‌రు నేత‌ల‌ను పోలీసులు.. రోడ్డుపైనే న‌డిపించుకుని తీసుకువెళ్ల‌డం వంటివి సంచ‌ల‌నంగా మారాయి. సొంత పార్టీ నాయ‌కుల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు మైల‌వ‌రంలో కేసులు న‌మోదు కావ‌డం వంటివి లేదు. పైగా.. గ‌తంలో క‌లివిడిగా ఉండ‌డం క‌లిసి ప‌నిచేయ‌డం తెలిసిందే. అయితే.. ఇప్పుడు దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది.

ఏం జ‌రిగింది?

మైలవరంలో టీడీపీ నేతలపై కేసులు పెట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దీనికి కార‌ణం.. కొద్దిరోజులుగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై సోషల్ మీడియా వేదికగా రెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. స్థానికంగా ప‌నులు చేయ‌డం లేద‌ని.. అక్ర‌మాల‌కు తావిస్తున్నార‌ని.. మ‌ట్టిని త‌వ్వి తీసుకువెళ్తున్నా.. చూస్తూ ఊరుకున్నా ర‌ని వారు ఆరోపిస్తున్నారు. స‌హ‌జంగా ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడు.. ఎమ్మెల్యే చ‌ర్చించి .. ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

సొంత నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకోవాలి. కానీ, దీనికి భిన్నంగా తనను ప్రశ్నించిన ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి (పెద్దబాబు), రమేష్ రెడ్డిలకు పది రోజుల క్రితం ఎమ్మెల్యే వసంత షోకాస్ నోటీసులు ఇచ్చారు. త‌న ప‌రువు తీస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. వారు తాము ఆరోపించిన‌వి వాస్త‌వాలేన‌ని.. ఎమ్మెల్యే త‌మ‌కు అప్పాయింట్‌మెంటు ఇస్తే.. చ‌ర్చిస్తామ‌ని పేర్కొన్నారు. కానీ, వ‌సంత వారి డిమాండ్‌ను తోసిపుచ్చారు. అంతేకాదు.. మంగ‌ళ‌వారం పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు.

దీంతో త‌మ స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారంపై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర‌ కార్యాలయానికి వెళ్లి చ‌ర్చించి వస్తుండగా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద పెద్దబాబు, రమేష్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్టు విష‌యం తెలుసుకున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పోలీసు స్టేష‌న్‌కు చేరుకుని.. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అరెస్ట్ చేసి ఆటోలో ఎక్కేందుకు నిరాకరించడంతో నడిరోడ్డుపై టిడిపి నేతలను నడిపించుకుని తీసుకెళ్లిన పోలీసులు.. వారిపై భౌతిక దాడికి పాల్ప‌డ్డార‌ని కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు.

మంచిదేనా..?

ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా.. ఎమ్మెల్యే కొంత స‌ర్దుబాటు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించాలి. రెండు సార్లు విజ‌యం ద‌క్కింది కాబ‌ట్టి.. ఇక‌, తిరుగు ఉండ‌ద‌నో.. లేక అధిష్టానం ద‌గ్గ‌ర ప‌ర‌ప‌తి ఉంద‌ని భావిస్తేనో.. అది ఇబ్బందికి దారితీస్తుంది. దీనికి వ‌సంత కూడా అతీత‌మేమీ కాదు. ఈ విష‌యాన్ని ఆయ‌న గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాగా.. ప్ర‌స్తుతం అరెస్టు అయిన వారు.. మాజీ మంత్రి దేవినేని ఉమాఅనుచ‌రులు కావ‌డం గ‌మ‌నార్హం.