అనంతపురం : తమ్ముళ్లు వర్సెస్.. తమ్ముళ్లు.. !
సాధారణంగా.. ఎక్కడైనా అధికార పక్షానికి.. ప్రత్యర్థి పక్షానికి మధ్య వివాదాలు జరుగుతాయి. ఇరు పక్షాలు దెబ్బలాడుకుంటాయి.
By: Tupaki Desk | 23 April 2025 9:56 AMసాధారణంగా.. ఎక్కడైనా అధికార పక్షానికి.. ప్రత్యర్థి పక్షానికి మధ్య వివాదాలు జరుగుతాయి. ఇరు పక్షాలు దెబ్బలాడుకుంటాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అడ్డగించుకుంటారు. పెద్ద రచ్చ కూడా చేసుకుంటారు. కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ అవకాశం.. టీడీపీ నాయకులు ఎవరికీ ఇవ్వడం లేదు. తమలో తాము తన్నుకుంటున్నారు. పైకి కొందరు కనిపిస్తున్నారు. కొందరు మౌనంగా అంతర్గత కుస్తీలు పడుతున్నారు.
దీంతో అనంత పురం రాజకీయాల గురించి చెప్పాలంటే.. తమ్ముళ్లు వర్సెస్ తమ్ముళ్లు.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకప్పుడు అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో ఢీ అంటే ఢీ అన్న జేసీ బ్రదర్స్.. ఇప్పు డు కూడా.. ఇక్కడ నుంచి విజయందక్కించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌తో ఢీ అంటున్నారు. అంతేకాదు.. ప్రత్యేకంగా.. నియోజకవర్గంలో గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. దగ్గుబాటి కూడా అంతే దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
ఇక, గుంతకల్లు నియోజకవర్గం గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీనికి కారణం.. వైసీపీ నుంచి వచ్చి టీడీపీ తరఫున గెలిచిన.. మాజీ మంత్రి.. గుమ్మనూరు జయరాం.. తన పార్టీనాయకులపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారన్నది రోజూ వినిపిస్తున్న మాట. పైగా.. ఎవరైనా ప్రశ్నించినా కూడా.. ఆయన స్వరం వేరేగా ఉంటోంది. సో.. మొత్తానికి ఈయన సొంత పార్టీ నాయకులపై కూడా.. కారాలు మిరియాలునూరుతూ.. స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తున్నారు.
ఇక, కల్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు.. తమ్ముళ్లకు తప్ప.. అందరికీ అందుబాటులోనే ఉంటు న్నారు. తమ్ముళ్లు ఏమైనా అడిగినా.. కూడా.. ఆయన లేదు కాదు.. అంటున్నారట. కానీ, ఇదే సమయంలో తనకు పరిచయం ఉన్న వైసీపీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎలా చూసుకున్నా.. ఈ నియోజకవర్గంలో అమిలినేని తీరుపై తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, శింగన మలలోనూ.. తమ్ముళ్లకు దూరంగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ వ్యవహరిస్తున్నారు. అదేమంటే.. తాను నిక్కచ్చి.. అని చెబుతున్నారట. ఇదీ.. మొత్తంగా ఉమ్మడి అనంత జిల్లాలో తమ్ముళ్ల తీరు.