ప్రపంచ రాజకీయ చరిత్రలో తొలిసారి.. హైబ్రిడ్ మహానాడు
అవకాశాల్ని అందిపుచ్చుకోవటం అందరికి సాధ్యమయ్యేది కాదు. కొందరు మాత్రమే ఆ పని చేయగలుగుతారు.
By: Garuda Media | 29 May 2026 10:08 AM ISTఅవకాశాల్ని అందిపుచ్చుకోవటం అందరికి సాధ్యమయ్యేది కాదు. కొందరు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. పని ఏదైనా దాన్ని రోటీన్ కు భిన్నంగా చేయటం అంత ఆషామాషీ కాదు. తూతూ మంత్రంగా కాకుండా.. కమిట్ మెంట్ తో చేస్తే.. సరికొత్త చరిత్రను క్రియేట్ చేసే అవకాశం లభిస్తుంది. తాజాగా ఏపీ అధికారపక్షం తెలుగుదేశం పార్టీ అలాంటి పనినే చేసింది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మహానాడు కార్యక్రమాన్ని వీలైనంత భారీగా నిర్వహించటం తెలుగుదేశం పార్టీకి అలవాటు.
దాన్నో రాజకీయ సమావేశంగా కాకుండా.. పార్టీ విధానాలు రూపొందించే అత్యున్నత వేదికగా పని చేసేలా డిజైన్ చేయటం కనిపిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28తో ముగిసేలా దీన్ని డిజైన్ చేస్తారు. మహానాడు ఆఖరి రోజున పార్టీ రాజకీయ తీర్మానాలను ఆమోదిస్తారు. అదే సమయంలో పార్టీకి వచ్చిన ఆదాయం.. ఖర్చులకు సంబంధించిన వివరాల్ని వెల్లడించటం కనిపిస్తుంది. ఈ మహానాడులో ప్రత్యేకత ఏమంటే.. పార్టీ అత్యుత్తమ నాయకత్వం మొదలు గ్రామీణ స్థాయి సాధారణ కార్యకర్త వరకు ఇందులో పాలుపంచుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇంధన పొదుపు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో మహానాడును హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించాలని డిసైడ్ చేశారు. అందుకు తగ్గట్లే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఇలాంటి హైబ్రిడ్ విధానంలో రాజకీయ పార్టీ నిర్వహించే కార్యక్రమాలు తూతూ మంత్రంగా లేదంటే ఒక మోస్తరుగా మాత్రమే నిర్వహించే వీలు ఉంటుంది. అందుకు భిన్నంగా.. దీన్నో అవకాశంగా తీసుకొని.. రోటీన్ గా నిర్వహించే మహానాడుకు మించి.. క్యాడర్ లో సరికొత్త జోష్ ను నింపేలా ప్లాన్ చేసిన తీరు ఇప్పుడు కొత్త చరిత్రకు కారణమైంది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రపంచంలో మరే రాజకీయ పార్టీ కూడా హైబ్రిడ్ విధానంలో ఇంతటి భారీ రాజకీయ సదస్సును నిర్వహించిన దాఖలాలు లేవు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఒకే సమయంలో లక్షలాది మంది కలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం.. అది కూడా ఏకపక్ష ప్రసంగంగా మాదిరి కాకుండా.. కేంద్ర కార్యాలయంలోని నేతలతో వివిధ క్లస్టర్లలోని కార్యకర్తలు ప్రత్యక్షంగా మాట్లాడేలా దీన్ని డిజైన్ చేయటం ఒక ప్రత్యేకతగా చెప్పాలి. ఏపీ వ్యాప్తంగా మొత్తం 1875 క్లస్టర్ కేంద్రాల్లో ఎల్ ఈడీ స్క్రీన్లు.. స్పీకర్ల ద్వారా ఏకకాలంలో లక్షలాది మంది ఒకేచోట పండుగ మాదిరి రాజకీయ సదస్సును నిర్వహించుకోవటం ఇదే తొలిసారి.
నిజానికి ఈ హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడు ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందన్న సందేహం పార్టీ పెద్దల్లో ఒకలాంటి ఆందోళన వ్యక్తమైంది. అయితే..దీన్ని పటాపంచలు చేస్తూ.. కిందిస్థాయి నేతలు మొదలు కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు రావటంతో.. హైబ్రిడ్ మహానాడుకు ఏకంగా 24.50 లక్షల మంది హాజరై సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఈ స్పందన పార్టీ నాయకత్వాన్నే ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి.
ఇంత పెద్దఎత్తున ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన హైబ్రిడ్ విధానానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ తరహాలో రాజకీయ సదస్సును గతంలో కొందరు ట్రై చేసినా.. ఇంత భారీ ఎత్తున నిర్వహించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. బహామాస్ కు చెందిన ఫ్రీ నేషనల్ మూవ్ మెంట్ పార్టీ 2022లో తమ దేశ వ్యాప్త ప్రతినిధుల కోసం తమ మొదటి హైబ్రిడ్ కాంక్లేవ్ ను నిర్వహించింది. అయితే.. అది కేవలం కొంతమంది డెలిగేట్లతో ఇంటర్నల్ సమావేశం మాత్రమే. ఇంత భారీ ఎత్తున నిర్వహించింది లేదు.
కొవిడ్ సమయంలో అమెరికాలోని నాటి అధికార డెమొక్రాటిక్.. విపక్ష రిపబ్లికన్ పార్టీలు తమ జాతీయ కన్వెన్షన్లను వర్చువల్.. హైబ్రిడ్ పద్దతిలో జరిపాయి కానీ.. ఇంత భారీ ఎత్తున మాత్రం కాదు. అదే సమయంలో మన దేశంలో బీజేపీ.. వైసీపీలు వర్చువల్ ర్యాలీలు.. ఆన్ లైన్ సమావేశాలు నిర్వహించాయి. కానీ.. పొదుపు చర్యల్లో బాగంగా గ్రామస్థాయి వరకు డిజిటల్ కేంద్రాల్ని ఏర్పాటు చేసి.. లక్షలాది మందిని ఒకే సమయంలో ఒకేచోటు కలిపేలా హైబ్రిడ్ వార్షిక మహోత్సవానికి మాత్రం తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది.
