చంద్రబాబుకు కౌంటరుగా అల్లు అర్జున్ ర్యాలీ.. యాక్షన్ లోకి కూటమి ప్రభుత్వం!
సీనియర్ ఐపీఎస్ అధికారిపై చర్యలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By: Tupaki Desk | 8 Aug 2025 1:42 PM ISTసీనియర్ ఐపీఎస్ అధికారిపై చర్యలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ర్యాలీకి అవాంతరాలు ఎదురయ్యేలా చేశారనే అభియోగాలపై విచారణకు సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యాక విపక్ష నేతలు, నాటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో నంద్యాల ఎస్పీగా పనిచేసిన రఘువీర్ రెడ్డిపై విచారణకు ఇద్దరు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నంద్యాలలో పోటాపోటీ ర్యాలీ
2024 ఎన్నికల సమయంలో నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి నాటి విపక్ష నేత, ప్రస్తుతం సీఎం చంద్రబాబు వెళ్లారు. ఈ పర్యటనకు ఆయన ముందస్తుగా అనుమతి తీసుకోగా, అదే సమయంలో సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాల వచ్చారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డికి మద్దతు పలికేందుకు వచ్చిన అల్లు అర్జున్ ర్యాలీగా ఆయన ఇంటికి వెళ్లారు. దీనికి అనుమతి లేకపోవడంతో అప్పట్లో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ర్యాలీకి పోటీగానే వైసీపీ అల్లు అర్జున్ ను పిలిపించిందని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ఇక ఎన్నికల సంఘం ఆదేశాలతో అప్పట్లోనే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయగా, అప్పటి ఎస్పీ రఘువీర్ రెడ్డిని విధుల నుంచి తప్పించింది.
ఈసీ ఆదేశాల ప్రకారం
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వీఆర్ లో కొనసాగుతున్న రఘువీర్ రెడ్డిపై తాజాగా విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల ప్రకారం రఘువీర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఇంటెలిజెన్స్ ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణను విచారాణాధికారిగా నియమించింది. అలాగే అనంతపురం డీఐజీ షిముని ప్రజెంటింగ్ ఆఫీసర్ గా నియమించారు. రఘువీర్ రెడ్డిపై నమోదైన అభియోగాలపై విచారించి నివేదిక సమర్పించాలని సీఎస్ విజయానంద్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
