Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా దెబ్బతో టీడీపీ మహిళా నేత ఔట్

ఎంతటివారైనా సరే సోషల్ మీడియాను వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలుగు మహిళ గాయత్రి వ్యవహారం నిరూపిస్తోందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 April 2025 4:39 PM IST
సోషల్ మీడియా దెబ్బతో టీడీపీ మహిళా నేత ఔట్
X

సోషల్ మీడియాతో నేతలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే ఉదంతం ఇది. స్పేస్ ఉందనో.. నా అకౌంటు నా ఇష్టమనో ముందు వెనుక ఆలోచించకుండా వ్యవహరిస్తే.. కెరీర్ కోల్పోయే ప్రమాదమే ఎక్కువని ఈ ఘటన ద్వారా తెలుసుకోవాల్సివుంటుందని అంటున్నారు. G3 అనే అకౌంటు ద్వారా ట్విటర్ (ఎక్స్)లో యాక్టివ్ గా ఉండే తెలుగు మహిళా అధికార ప్రతినిధి గాయత్రి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. టీడీపీకి వీర విధేయురాలైన ఆమెను సోషల్ మీడియా ఒత్తిడితో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తప్ప మరో మార్గం లేక టీడీపీ చేతులెత్తేయాల్సిన పరిస్థితి రావడం చర్చనీయాంశమవుతోంది.

ఎంతటివారైనా సరే సోషల్ మీడియాను వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలుగు మహిళ గాయత్రి వ్యవహారం నిరూపిస్తోందని అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన గాయత్రి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే గతంలో ఆమె భారత్-పాకిస్థాన్ సంబంధాలు, భారతీయ పునాణ ఇతిహాసలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. పెహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం హిందూ సంఘాలు, బీజేపీ మద్దతుదారులు గాయత్రి వ్యాఖ్యలను వైరల్ చేయడంతో టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఆమెను పార్టీ నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. దీంతో టీడీపీ హైకమాండ్ గాయత్రిపై సస్పెన్షన్ వేటు వేసింది.

‘‘పార్టీ నియమావళికి విరుద్ధంగా సోషల్ మీడియాలో తెలుగు మహిళ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీమతి సందిరెడ్డి గాయత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశిస్తున్నాం’’ అంటూ ఏకవ్యాఖ్య ప్రకటనను టీడీపీ విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు పేరుతో విడుదలైన ఈ ప్రకటనతో గాయత్రి కెరీర్ ముగిసినట్లైంది. పార్టీ అధికారంలో ఉండగా, మంచి పొజీషన్ కు వెళ్లాల్సిన ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని అంటున్నారు.

ఈ వ్యవహారంతో ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా ఎతంటి క్రియాశీలంగా ఉందో మరోమారు స్పష్టమైందని అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశాలు ఉన్నాయని సంబరపడాలో.. అనవసర వివాదాల్లో చిక్కుకుంటున్నామని మదన పడాలో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే దేశ భద్రత, మతానికి సంబంధించిన సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గాయత్రి వ్యవహారం ద్వారా స్పష్టమవుతోందని అంటున్నారు.